Post master corruption in Krishna District:కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం ఇనంపూడిలో ఖాతాదారులు తమ సొమ్మంతా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. తమ డబ్బులన్నీ భద్రంగా ఉన్నాయనుకున్నారు. అవన్నీ పోస్ట్ మాస్టర్ జేబులోకి వెళ్తున్నాయని గ్రహించలేకపోయారు. కొన్ని రోజులకు అవకతవకలు అనుమానం వచ్చి అధికారులకు పిర్యాదు చేయగా.. అసలు విషయం బయటపడింది. దాదాపు 4 లక్షల రూపాయలను ఖాతాలో జమ చేయకుండా పోస్టమాస్టరే మింగేసినట్టు తెలింది. గ్రామీణ ప్రాంతం కావడం, ప్రజలకు అవగాహన లేకపోవడంతో పోస్ట్ మాస్టర్‌కి డబ్బులు సొంత అవసరాలకు వాడుకునే వీలు కలిగింది.
ఖాతాదారుల నుండి స్వీకరించిన సొమ్మును పుస్తకాల్లో నమోదు చేసి, ఖాతాలో జమ చేయలేదని అధికారులు తెలిపారు. ఆ సొమ్ము దాదాపు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. డబ్బులు తీసుకొని రశీదులు ఇవ్వని వాటి గురించి ఆరా తీస్తున్నారు. దీంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా పోస్ట్ మాస్టర్ పాలైందని గ్రామస్థులు వాపోయారు. కనీసం సంవత్సరం నుండి ఆడిట్ చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.