స్వాతంత్య్రోద్యమంలో మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల పాత్ర కీలకం. ఉద్యమ బోధనే లక్ష్యంగా ఏర్పడిన ఈ కళాశాల ఆవిర్భావమే మహోజ్వల ఘట్టంగా ఇప్పటికీ చెప్పుకొంటారు. ఇక్కడ ఉద్యమాలకు ఊపిరి పోయడంతోపాటు స్వాతంత్య్రోద్యమాభిలాషను విద్యార్థులకు అలవర్చింది. తద్వారా ఎంతోమంది మహనీయులు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అలాంటి వారిలో కళాశాల ఏర్పాటులో త్రిమూర్తులుగా ఖ్యాతిపొందిన ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభిసీతారామయ్య ప్రత్యేక గుర్తింపు పొందారు. 1907 మార్చి 27న కళాశాల దేశభక్త బిరుదు పొందిన కొండా వెంకటప్పయ్య చేతులమీదుగా ప్రారంభించి దేశమంతాత బందరు వైపు చూసేలా చేశారు. 1910 నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తన ఆస్తినంతటినీ వితరణగా అందించిన కోపల్లె దాతృత్వాన్ని చాటుకున్నారు. 1910 నుంచి 1921 వరకు మొట్టమొదటి ప్రధానాచార్యునిగా ఉన్నారు. పింగళి వెంకయ్య, ప్రమోద్‌కుమార్‌ఛటర్జీ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి ఎందరో మహనీయులు సేవలు అందించారు.
నర్సయ్య త్యాగం చిరస్మరణీయం
నర్సయ్యనాయుడు జెండా ఎగురవేసిన కోనేరుసెంటరు
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆంగ్లేయులు లాఠీలతో కొడుతున్నా ఏమాత్రం భయపడకుండా దెబ్బలకు ఎదురొడ్డి మచిలీపట్నం కోనేరుసెంటరులో జాతీయజెండా ఎగురవేసిన తోట నర్సయ్యనాయుడు నేటి తరానికి ఆదర్శనీయం. జెండావీరునిగా బందరు చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటను ఏర్పాటు చేసుకున్న త్యాగం అజరామరం. నర్సయ్యనాయుడు జెండా ఎగురవేస్తున్న సమయంలో 15మంది ఆంగ్ల సైనికులు ఒకేసారి లాఠీలతో కొడుతూ బూట్లతో తంతూ శరీరాన్ని హూనం చేస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా స్తూపంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందేమాతన నినాదం చేసి తనదేశభక్తిని చాటుకున్నారు.
పింగళికి ప్రత్యేక బంధం
త్రివర్ణపతాకాన్ని రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యది జిల్లాలోని భట్లపెనుమర్రు అయినా బందరుతోనే ఆయనకున్న అనుబంధం ఎక్కువ. బందరులోని ఆంధ్రజాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్న సమయంలోనే మువ్వన్నెల పతాకాన్ని రూపొందించి విజయవాడకు తీసుకెళ్లినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెల్ కంపెనీగా ఉన్న పూర్వ ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీలో విధులు నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన త్యాగాలకు గుర్తుగా జిల్లాకేంద్రంలో పింగళి విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు కళాశాలకు ఆనుకొని ఉండే రాజుపేటలో ఓ వీధికి ఆయన పేరు పెట్టారు.
చిన్నాపురంలో ఉప్పుసత్యాగ్రహం
హోంరూల్, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాల్లో బందరు భాగస్వామ్యం ప్రత్యేకం. ఉప్పుసత్యాగ్రహం సమయంలో పలువురు బందరు మండల పరిధిలోని చిన్నాపురంలో ఉప్పు తయారీ చేపట్టారు. బందరు పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉక్కు మహిళగా పేరొందిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాల్గొన్నారు. చిన్నాపురంలోని స్తూపం నాటి చరిత్రకు సాక్ష్యంగా ఉంది.