గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మేయర్ పీఠం తమదంటే... తమదంటూ అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రకటనలిచ్చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ వరకు అన్నింటినీ ప్రణాళిక ప్రకారం చేస్తోంది. కానీ.... ప్రతిష్ఠాత్మక గ్రేటర్ ఎన్నికల్లో ఎంత మంది నగర ప్రజలు ఓటు వేయకుండా ఉండిపోతారోననే కలవరపాటు ఎక్కువైంది. ఇందుకు గతంలో నమోదైన ఓటింగ్ శాతమే కారణం. పేరుకు విద్యావంతుల నగరమే అయినా... ఓటు వేసేందుకు మాత్రం ఇక్కడి పౌరులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం గత కొన్నేళ్ల ఎన్నికల సరళిని గమనిస్తే స్పష్టమవుతుంది.
వాళ్లంతా ఓటింగ్‌కు దూరం
గత మూడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. 2002 ఎన్నికల్లో 41.22 శాతం ఓటింగ్ జరగ్గా... 2009లో 42.95శాతం పోలింగ్ నమోదైంది. 2016లో 45.27 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ మూడు వరుస ఎన్నికల్లో కనీసం సగం... ఓట్లు కూడా నమోదు కాలేదంటే.. నగర ఓటర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఓటువేస్తున్న వారిలోనూ వయోధికులే అధికంగా ఉంటుండగా.. యువత ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. రాజధాని నగరంలో సహజంగా ఉద్యోగులు, విద్యావంతులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎక్కువ. ఇక్కడే ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇందులోనూ... విద్యావంతులు, ధనవంతులు ఉంటున్న ప్రాంతాల కంటె మధ్యతరగతి, పేదలు నివసిస్తున్న ప్రాంతాలు, బస్తీల్లోనే ఓటింగ్ ఎక్కువగా నమోదవుతోంది.
10 డివిజన్లలో 20శాతం లోపు పోలింగ్
2016 ఎన్నికల్లో 10 డివిజన్ల పరిధిలో 20 శాతం లోపు ఓటింగ్ నమోదయింది. 18 డివిజన్లల్లో 30 శాతం ఓటింగ్ మించలేదు. ఇక 62 డివిజన్లల్లో ఓటింగ్ శాతం 40 దాటలేదు. పేదలు, రోజు కూలీలకు వెళ్లే వాళ్లూ పోలింగ్ రోజు కచ్చితంగా ఓటు హక్కును వినియోగిస్తుండగా, ఓటు హక్కు విలువ తెలిసిన వాళ్లు ఓటును వినియోగించుకోకపోవడం దురదృష్టం. ముఖ్యంగా గ్రేటర్‌లో దాదాపు 6 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగులు ఉంటుండగా... వీరిలో 10 శాతం మంది కూడా... ఓటు వేసేందుకు రావడం లేదు. ధనవంతులు ఓటింగ్‌కు వరుసలో నిలుచునేందుకు నిరాశక్తత చూపిస్తున్నారంటున్న విశ్లేషకులు... ఉద్యోగులు ఎన్నో సాకులు చూపుతున్నారని విమర్శిస్తున్నారు. తెలియని వాళ్లకు చెప్పాల్సిన వాళ్లే... ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.