jagananna colonies : చిన్నపాటి వర్షానికే కొన్ని చోట్ల జగనన్నకాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి వాన నీరు నిలిచి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రూ.కోట్లు పోసి మెరక పనులు చేసినా చాలాచోట్ల ఫలితం లేకుండా ఉంది. కొన్ని లేఅవుట్లను మెరక చేయకుండానే వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో, చెరువు, కాలువలను ఆనుకుని ఉన్న స్థలాలు, పొలాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది.
రోజుల తరబడి నిల్వ ఉంటోంది. నాణ్యత లేకుండా నిర్మించిన అంతర్గత రహదారులు, కాలనీల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్లు.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకముందే వాటి రూపు కోల్పోయి గుంతలమయంగా మారాయి. వర్షపు నీరు నిలుస్తుందని తెలిసీ కొన్ని ప్రాంతాల్లో రూ.కోట్లు పోసి భూమిని కొనుగోలు చేయడంపై అక్కడి ఉన్నతాధికారులే పెదవి విరుస్తున్నారు. గత వారం కురిసిన చిన్నపాటి వర్షాలకే జలమయమైన జగనన్న కాలనీలపై.. సచిత్ర కథనం.
మెరక చేసినా మునకే...
కృష్ణా జిల్లా బందరు నగర వాసులకు కేటాయించిన కరగ్రహారం లేఅవుట్ ఇది. ఇక్కడ సుమారు 16 వేల మందికి స్థలాలు కేటాయించారు. 300 ఎకరాల విస్తీర్ణం ఉన్న లేఅవుట్‌ను రూ.లక్షలు పోసి మెరక చేశారు. అయినా చిన్నపాటి వర్షం కురిసినా నీరు చేరి తటాకాన్ని తలపిస్తోంది. ఇక్కడ ఒక్క నిర్మాణమూ ప్రారంభం కాలేదు. జిల్లాలో చాలా లేఅవుట్లలో ఇదే పరిస్థితి.
వాన పడితే రహదారి మడుగే...
వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తున్న పొలాల మధ్య ఉన్న ఈ రహదారి పశ్చిమగోదావరి జిల్లా ఉండి ప్రాంతంలో జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం. ఈ కాలనీకి చేరుకొనేందుకు పెడాయికోడు గట్టు నుంచి పొలాల మీదుగా రెండేళ్ల కిందట గ్రావెల్ రోడ్డు వేయగా వాహనాల తాకిడికి పూర్తిగా దెబ్బతింది. ఇటీవలి వర్షాలకు నీరు నిలిచి బురద కయ్యలా మారింది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు నడిచి వెళ్లే దారే కనిపించడంలేదని, నిర్మాణ సామగ్రిని దూరంగా పెట్టుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
చినుకు పడితే చెరువులే
ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకే జగనన్న కాలనీల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. కొన్ని చోట్ల లే అవుట్లు మెరక చేయకుండా వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.
మెరక, చదునుకే రూ.1,700 కోట్లు:రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన జగనన్న కాలనీల్లో మెరక, చదును పనులు చేసేందుకే ప్రభుత్వం రూ.1,700 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇందులో ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కేటాయించిన రూ.1,100 కోట్లను వినియోగించింది. మరో రూ.400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా... ఇంకో రూ.200 కోట్ల వరకు వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిధుల్లో మెజారిటీ మొత్తాన్ని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వినియోగించారు.