Polytechnic Entrance : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ – 2023 ప్రవేశ పరీక్ష కోసం ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 24 నుంచి కొత్త బ్యాచ్ కు అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పాలిటెక్నిక్ విద్య, ఉపాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 30 తుది గడువుగా పేర్కొన్నారు. పిన్న వయస్సులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి పాలిటెక్నిక్ విద్య ఓ మంచి మార్గంగా నాగరాణి తెలిపారు.
మే 10న ప్రవేశ పరీక్ష.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాల్లోని 410 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ 2023 నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ పరీక్షకు లక్షన్నర మంది విద్యార్థులు హాజరవుతారని అన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు పదో తరగతి సిలబస్ నుంచి గణిత శాస్త్రం 50 మార్కులు, భౌతిక శాస్త్రం 40 మార్కులు, రసాయన శాస్త్రం 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల కాల నిర్దేశములో పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్, 176 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.