కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని జయంతిపురం, గోపినేనిపాలెం దారి వెంట.. కొందరు రసాయన వ్యర్థాలను బహిరంగంగా పారపోస్తున్నారని అధికారులు గుర్తించారు. ఫలితంగా.. మూగజీవాలు, పశుపక్ష్యాదులు, పచ్చటి చెట్లు చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పంట కాల్వల్లో సైతం రసాయన వ్యర్థాలను వదులుతున్నారని చేసిన ఫిర్యాదుల మేరకు కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించారు. ఆయా ప్రాంతాలను పరిశీలించారు. జయంతిపురం, గోపినేనిపాలెం దారి వెంట రసాయన వ్యర్థాల నమూనాలను సేకరించారు.
వ్యర్థాలను రోడ్డుపై వేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కాలుష్య నియంత్రణ అధికారులు సూచించారు. పర్యావరణానికి హానిచేసే ఎంత పెద్ద కర్మాగారాలైనా.. ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవటం తప్పదని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి కర్మాగారాల యాజమాన్యాలకు నోటీసులను అందిస్తున్నామని వెల్లడించారు.