కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... పార్టీని వీడతారన్న ఊహాగానాలకు ఊతమిచ్చారు. శుక్రవారం మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి సీఎం జగన్ను కలిసి చర్చించారు. ఈ నేపథ్యంలో వంశీ పార్టీ మారేందుకు ముహూర్తం ఖరారైందని వార్తలు వచ్చాయి. అయితే గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు... ఈ పరిణామాలపై కినుకు వహించారు.
రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో... యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వైకాపా నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒకానొక సమయంలో యార్లగడ్డ ఇంటి వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెంకట్రావు వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. పార్టీ ముఖ్యనేతలు, అనుచరులతో వెంకట్రావు చాలాసేపు చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ... సీఎం జగన్పై తనకు పూర్తి విశ్వాసం ఉందని... పార్టీకి, నేతలకు ఎదురైన చేదు అనుభవాలను ఆయన దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.