ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసవత్తరంగా పుర ఎన్నికల ప్రచారం... అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం - విజయవాడ పురపాలక ఎన్నికలు న్యూస్

పుర పోరుకు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బలం చూపించుకునేందుకు అధికార పార్టీ నేతలు... పట్టు పెంచుకునేందుకు ప్రతిపక్షాలు పోటాపోటీగా శ్రమిస్తున్నాయి. ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకునేందుకు.. హామీల వరాల జల్లు కురుపిస్తున్నారు. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఈ ఎన్నికల్లో... ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

police on municipal election campaigns
పుర ఎన్నికల ప్రచారం

By

Published : Feb 27, 2021, 10:44 AM IST

విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికల వేడి పెరిగింది. రాష్ట్రంలోనే రెండో పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కావటంతో.. నగరంపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బలం నిరూపించుకునేందుకు.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుణదలలో జరిగిన దాడుల వంటి ఘటనలు పునరావృతం కాకుండా.. అప్రమత్తమయ్యారు. బందోబస్తు, రౌడీషీటర్ల కౌన్సిలింగ్, అసాంఘిక శక్తులపై నిఘా వంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా..

ఎన్నికలు జరగనున్న 64 వార్డుల్లో.. పటిష్టమైన నిఘా కోసం అదనంగా ఏసీపీలు, ఇన్స్​స్పెక్టర్లకు విధులు కేటాయించారు. వీరు రెగ్యులర్ శాంతి, భద్రతల ఏసీపీలకు సహాయంగా ఉంటారు. వీరందరూ మార్చి 1 నుంచి బాధ్యతలు తీసుకొని.. కేటాయించిన డివిజన్​లలో విధులు నిర్వర్తించనున్నారు. ఇందుకోసం ట్రాఫిక్, సైబర్, సీపీఆర్​బీ, సీపీఎస్, వంటి విభాగాల నుంచి అధికారులను నియమించుకున్నారు. నగర పరిధిలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతూ.. ఇప్పటికే అందరి అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నిల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు... అభ్యర్థుల ప్రచారాలకు సంబంధించి ఏకగవాక్ష విధానాన్ని వీఎంసీ తీసుకువచ్చింది. అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను 24 గంటల్లోనే పోలీసులు పరిష్కరిస్తున్నారు.

మఫ్టీలో.. విధులు

ప్రచారాలు జరుగుతున్న తీరుపైనా పోలీసులు సునిశిత దృష్టి సారించారు. మఫ్టీలో ఉన్న సిబ్బంది.. నేతల ప్రచారాన్ని గమనిస్తున్నారు. ఎక్కడైనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా... ప్రత్యర్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా వంటి వాటిని పరిశీలిస్తున్నారు. ముఖ్యనేతలు ప్రచారాల్లో పాల్గొన్నప్పుడు.. ఎస్సై, సీఐలు అనుసరిస్తున్నారు. ప్రచారంలో ఎవరైనా విద్రోహశక్తులు తిరుగుతున్నారా.. మద్యం డబ్బు ప్రభావం ఎలా ఉందనే అంశాలను గమనిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా గొడవలు జరగకుండా.. రౌడీషీటర్లకు టాస్క్​ఫోర్స్ పోలీసులు రోజూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

పోలీస్ పికెటింగ్

అన్ని విభాగాలు కలిపి 2,500 మంది సిబ్బంది సేవలను.. ఎన్నికల్లో వినియోగించనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వివిధ.. ప్రాంతాల్లో 20 ప్రాంతాల్లో చెక్​పోస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో 24 గంటలూ సిబ్బందిని విధుల్లో ఉంటారని అధికారులు వెల్లడించారు. మద్యం, నగదు అక్రమ రవాణా అరికట్టేందుకే ఈ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో దాదాపు 50 పోలీసు పికెట్లను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని మెుత్తం 788 పోలింగ్ కేంద్రాల్లో.. 221 కేంద్రాలు అతిసమస్యాత్మకం, 310 సమస్యాత్మకమైనవిగా వర్గీకరించారు. 257 కేంద్రాలు సాధారణమైనవిగా తేల్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలు అదనంగా మోహరించనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా... పుర సమరానికి హోరాహోరీ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details