చిన్నారి ద్వారక హత్యకేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాహేతర సంబంధం హత్యకు కారణమనే కోణంలోనూ దర్యాప్తు సాగింది. ఆ క్రమంలో బాలిక తల్లిని ప్రశ్నించినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితుడు ప్రకాశ్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, హత్య, సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించటం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని.. ఐపీసీ 376, 302, 201 కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటు పోక్సో సెక్షన్ 5 కింద కేసు కట్టారు. శవపరీక్ష ప్రాథమిక నివేదికలో బాలిక మెడ దగ్గర ఎముక విరగడం వల్లనే చనిపోయిందని వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు . అత్యాచారం జరిగిందా ? లేదా .. ? అనే విషయం పూర్తి నివేదికలో తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు.
చిన్నారి ద్వారక హత్యకేసులో వీడుతున్న చిక్కుముడులు - చిన్నారి ద్వారక హత్య కేసు వార్తలు
రాష్ట్రంలో సంచలనం రేపిన చిన్నారి ద్వారక హత్య కేసు కొలిక్కి వస్తుంది. బాలికను ప్రకాష్ అనే వ్యక్తే హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మెడ పక్క ఎముక విరగటంతో చిన్నారి మృతి చెందిందని శవపరీక్ష ప్రాథమిక నివేదికలో తేలింది. బాలికపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిర్థరణ అవుతుందని పోలీసులు చెపుతున్నారు.
కఠినంగా శిక్షించాలి
సోమవారం రాత్రికే బాలిక మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బాలిక బంధువులు పెద్దఎత్తున మార్చురీ ఎదుట ఆందోళన చేశారు. చిన్నారి మృతికి కారణమైన నిందితుడిని 72 గంటల్లో కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నల్లకుంటలోని చిన్నారి ఇంటి వద్ద మహిళాసంఘాలు రహదారిపై బైటాయించి ఆందోళనకు దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
నిందితుడికి నేరచరిత్ర
మైలవరం నియోజకవర్గం పరిధిలోని కుంటముక్కలకు చెందిన ప్రకాష్‌కు గతంలోనే నేరచరిత్ర ఉంది. నలుగురు అన్నదమ్ముల్లో మూడోవాడైన ప్రకాష్‌కు మద్యం అలవాటు ఉంది . ఈ విషయంలో అన్నదమ్ములతో వాగ్వాదం జరిగేదని స్థానికులు వెల్లడించారు. గతంలో ఓ బాలికపై అత్యాచారయత్నం కేసులో ప్రకాష్ అరెస్టయ్యాడు. 2010 డిసెంబర్ 21న.. అతను నివాసముండే కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు . బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా 11 నెలల జైలు శిక్ష అనుభవించాడు. శిక్ష తర్వాత బయటకొచ్చిన నిందితుడు భార్యతో పాటు పునాదిపాడులో ఉంటున్నాడు. రెండేళ్ల క్రితమే నల్లకుంటకు వచ్చి అద్దెఇంట్లో ఉంటూ కూలి పనులకు వెళ్తున్నాడు.