కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి.నేలటూరులో ఈనెల 6న జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
హత్యలకు కారణమేంటి?
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బడబాగ్ని రామాంజనేయ రాజు 2018లో తన కూతురు చరిష్మాని బ్రహ్మంగారిమఠం మండలం డి.నేలటూరు గ్రామానికి చెందిన అంజనమ్మ కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అదనపు కట్నంతో చరిష్మాని అత్తింటి వాళ్లు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా 2019లో చరిష్మాను దారుణంగా హత్య చేశారు.
చరిష్మా హత్యకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనుకున్న బడబాగ్ని రామాంజనేయ రాజు.. తన తమ్ముడు బడబాగ్ని శ్రీనివాస రాజుతోపాటు పేర్ని వెంకట వరప్రసాద్ రాజు, బడబాగ్ని బ్రహ్మ నారాయణమ్మలతో కలిసి చరిష్మా అత్త అంజనమ్మ, ఆడపడచు వరలక్ష్మమ్మలను అతి దారుణంగా కత్తులతో పొడిచి.. గొంతుకోసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. చరిష్మా హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు చేశారని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు.