POLICE NO ACTION ON GANNAVARAM INCIDENT : ఈ నెల 20న కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయంపై విధ్వంసానికి సంబంధించి మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. ఇందులో 59 మంది తెలుగుదేశం శ్రేణులపై.. కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కానీ.. అధికార వైసీపీ నుంచి 12 మంది పైనే, అదీ నామమాత్రపు కేసులు పెట్టారు. అక్కడ గాయాలైంది టీడీపీ కార్యకర్తలకు, ఆస్తి నష్టమూ ఆ పార్టీకే. ఒకే ఒక్క.. పోలీసుకు గాయమైంది. సీఐపై రాయి విసిరిందెవరో కూడా తెలియదు. కానీ పోలీసులు.. టీడీపీ నేతలపై ఒకేసారి 4 కేసులు నమోదు చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు.. హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు.. తెలుగుదేశం కార్యకర్త కోనేరు సందీప్ వాహనాన్ని.. తగలబెట్టారు. టీడీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి కళ్యాణి , బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, వి.హరిబాబు నాయుడు వాహనాలనూ ధ్వంసం చేశారు. కార్యాలయ అద్దాలు పగలగొట్టారు.
టేబుల్, కుర్చీలు, ఎన్టీఆర్ చిత్రపటం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి స్పష్టమైన వీడియోలున్నా.. దాడి చేసిన వైసీపీ వాళ్లలో ఒక్కరినీ అరెస్టు చేయలేదు. కేవలం 10 మందిపై బెయిల్‌బుల్ సెక్షన్లు పెట్టి.. చేతులు దులుపుకున్నారు. మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయంపై పడిన వైసీపీ నేతలు... పెట్రోలు పోసి నిప్పంటించి, కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసినా.. వాటిని మారణాయుధాలుగా పరిగణించకపోవడాన్ని తెలుగుదేశం నేతలు నిరసిస్తున్నారు.