TDP LEADER PATTABHI IN GANNAVARAM COURT : తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరచగా... పట్టాభి మరో 13 మంది నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభిని వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గన్నవరం సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం నేత పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు టీడీపీ నేతలు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని సీఐ కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1 గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు.
నిన్న పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైడ్రామా అనంతరం ఈరోజు గన్నవరం పీఎస్కు తీసుకొచ్చారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి.. స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు లోపలికి వెళ్లేముందు పట్టాభి తన వాచిపోయిన చేతులను అందరికీ చూపించారు. అదేవిధంగా కోర్టులోనూ తన న్యాయవాదులు, న్యాయమూర్తికి తనపై తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. ముసుగులేసుకున్న ముగ్గురు వ్యక్తులు వచ్చి వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి అరగంట సేపు కొట్టారని వివరించారు. అరికాళ్లు, అరిచేతులపై కొట్టారని తెలిపారు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేసరికి స్టాఫ్ ఎవ్వరూ లేరని... లైట్లు కూడా లేవని పట్టాభి వెల్లడించారు. కొద్దిసేపటి తరువాత మూడు గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి టవల్ చుట్టి వేరే గదిలోకి ఈడ్చుకువెళ్లారని చెప్పారు. కోర్టులో కూడా న్యాయమూర్తికి ఈ విషయాలను పట్టాభి వివరించారు.
నా భర్తను పోలీసులు చిత్రహింసలు పెట్టారు:పోలీసుల వైఖరిపై పట్టాభి భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను చూపించాలంటూ ఇంటి పైకి ఎక్కి నిరసన చేపట్టారు. పట్టాభి దగ్గరికి వెళ్లనీయకపోతే పైనుంచి దూకుతానంటూ హెచ్చరించారు. తన భర్తను పోలీసులు బాగా హింసించారని పట్టాభి భార్య చందన ఆరోపించారు. తోట్లవల్లూరు పీఎస్‍లో పట్టాభిని ముసుగేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని మొదట్నుంచీ చెబుతున్నట్లు తెలిపారు. పట్టాభి ఇంత ఆందోళనతో ఎప్పుడూ కనిపించలేదన్నారు.
"నా భర్తను పోలీసులు బాగా హింసించారు. తోట్లవల్లూరు పీఎస్‍లో పట్టాభిని ముసుగేసి కొట్టారు. నా భర్తకు ప్రాణహాని ఉందని మొదట్నుంచీ చెబుతున్నా. నా భర్తకు ఏమైనా జరిగితే దానికి డీజీపీ, ప్రభుత్వానిదే బాధ్యత"-చందన, పట్టాభి భార్య