కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం మాధవరం గ్రామంలో కరోనాతో మృతి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి పోలీసులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మండల ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సహకారంతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
గ్రామానికి చెందిన జువ్వాజి వెంకయ్య అనే వృద్ధుడు గత రాత్రి కరోనాతో మరణించాడు. కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఉండగా.. భయంతో గ్రామస్థులు, ఇరుగుపొరుగు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. సమాచారం అందుకున్న ఏ.కొండూరు ఎస్సై శ్రీనివాస్ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చారు. సిబ్బందితో పాటు.. స్థానికులైన ఒకరిద్దరి సహకారంతో మృతుడికి అంతిమ సంస్కారాలు చేయించారు. భౌతిక కాయాన్ని ఖననం చేసే సమయంలో పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి కార్యక్రమాన్ని పూర్తి చేయించారు.