పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం వర్షంలోనూ నెల్లూరులో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ చక్రధర బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ లతోపాటూ ఇతర అధికారులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ సేవలను వారు కొనియాడారు.
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం లాక్డౌన్లో పోలీసులు ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడారని ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి ఆదిములపు సురేష్ అన్నారు. ఒంగోలు మైదానంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి ఆయన పూలమాలలతో శ్రధ్ధాంజలి ఘటించారు. కలెక్టర్, ఎస్పీ సిద్దార్థ కౌశల్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవం జరిగింది. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్, అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీ బాజ్‌పేయ్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జగ్గయ్యపేట పట్టణ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు శాంతియుత ర్యాలీగా చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు చెబుతూ నినాదాలు చేశారు. చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అమరుడైన ఎస్ఐ అల్లు దుర్గారావుని జ్ఞాపకం చేసుకుంటూ రెండు నిమిషాలపాటు అందరూ మౌనం పాటించిచారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖరరావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, జగ్గయ్యపేట ఎస్ఐలు చిన్న బాబు, రామారావు, పట్టణ రక్షక దళ సభ్యులు, మహిళ పోలీసులు, వార్డు వాలంటీర్లు, సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు