పన్నులు ఎగ్గొట్టి కోట్ల రూపాయల సొమ్మును దేశాలు దాటిస్తున్నారు. తాజాగా విజయవాడ నుంచి గుంతకల్‌కు హవాలా ద్వారా పంపించేందుకు సిద్ధంగా ఉన్న కోటి రూపాయల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వాట్సాప్ గ్రూపు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా హవాలా ముఠా నిర్వహిస్తున్న ఈ లావాదేవీలను పోలీసులు రట్టు చేశారు.
హవాలా ముఠా లావాదేవీలన్నీ వాట్సాప్‌లోనే సాగుతుంటాయి. ముందుగా ముఠా సభ్యులంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూపుగా ఏర్పడతారు. తొలుత డబ్బును ఒక చోటకు చేరుస్తారు. ఆ తర్వాత ఎవరికి, ఎలా ఇవ్వాలో ప్రధాన సూత్రధారి నిర్ణయిస్తారు. డబ్బును ఎవరు తీసుకుంటారో.. వారికి ఒక 10 రూపాయల నోటు ఇస్తారు. దీనికి ముందు ఆ నోటు ఫొటో తీసి హవాలా సభ్యుడికి వాట్సాప్ ద్వారా పంపిస్తారు.10 రూపాయల నోటు తీసుకున్న వ్యక్తి తనకు కావాల్సిన చోటుకు వెళ్లి, అక్కడున్న హవాలా సభ్యుడికి ఆ నోటు ఇస్తారు. నోటు మీద ఉన్న సీరియల్ నెంబరే నగదు లావాదేవీల కోడ్‌గా పరిగణిస్తారు. కోడ్ సరిపోలితే నోటు తెచ్చిన వ్యక్తికి హవాలా సొమ్ము మొత్తం ఇచ్చేస్తారు. ఇలా 10 రూపాయల నోటే హవాలా రాకెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తోంది. దీన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు విజయవాడ నుంచి గుంతకల్‌కు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కోటి రూపాయల నగదును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.