ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదాయం కోసం.. పోలవరం కాలవ గట్టుపై మట్టి తవ్వకాలు - Polavaram canal embankment illegal excavations news

కాలువ గట్లు, నదీప్రాంత కరకట్టలపై తవ్వకాలు నిషేధం. కానీ కృష్ణాజిల్లాలో మాత్రం అడ్డుకోవాల్సిన అధికారులే అందుకు అనుమతిస్తున్నారు. అదేమంటే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా..! అని సమాధానం ఇస్తున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బలివర్రు వద్ద పోలవరం కాలువ గట్టును యధేచ్ఛగా తవ్వేస్తున్నారు.

Polavaram canal embankment
పోలవరం కాలవ గట్టు అక్రమ తవ్వకాలు

By

Published : Jan 8, 2021, 11:00 PM IST

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ సమీపంలో పోలవరం కాలువకు గండి పడింది. కారణం మట్టి తవ్వకాలు. ఇదే కాదు.. ఇలాంటి గండ్లు పది వరకు ఉన్నాయి. కొన్ని చోట్ల బలహీన పడి రేపోమాపో తెగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈఏడాది పోలవరం కాలువకు పట్టిసీమ నీటిని విడుదల చేయలేదు. పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే.. కాలువ గట్ల పరిస్థితి బహిరంగమవుతుంది. రూ.కోట్లు వెచ్చించి పోలవరం కుడి కాలువ నిర్మాణం చేశారు. దాదాపు 8,500 క్యూసెక్కులకు పైగా నీటి విడుదలకు అనుగుణంగా నిర్మించారు. గత నాలుగు సంవత్సరాలుగా పట్టిసీమ ద్వారా కుడికాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు అందిస్తున్నారు. అదే కాలువను ఇప్పుడు రూ.కోట్ల కోసం బలహీనపరుస్తున్నారు. కొంతమంది నేతల ఒత్తిడికి జలవనరుల శాఖ, గనులు, భూగర్భ గనుల శాఖ అధికారుల తలొగ్గుతున్నారు. వేరే ప్రాంతాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చినా పోలవరం కాలవ గట్టుపై గ్రావెల్‌ తవ్వేందుకు తాత్కాలిక అనుమతులు జారీ చేస్తున్నారు.

తాత్కాలిక అనుమతులు:

ఒక్క గన్నవరం నియోజకవర్గంలో నేతల బినామీలకు 25లక్షల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు గనుల శాఖ లీజులు జారీ చేసింది. ఇవి కాకుండా పోలవరం గట్టుపై తాత్కాలికం పేరుతో అనుమతులు ఇవ్వడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు తెలిసింది. జిల్లాలోని అయిదు మండలాల పరిధిలో 55 కి.మీ మేర పోలవరం కుడికాలువ విస్తరించి ఉంది. 80 మీటర్ల వెడల్పున కాలువ తవ్వారు. ఈ క్రమంలో వచ్చిన మట్టిని కట్టగా పోశారు. దీన్ని తరలించేందుకు అధికారులు ఎత్తులు వేశారు. పోలవరం కట్టపై మొత్తం నీటిపారుదల శాఖ 113 ప్రాంతాలలో కట్టకు అవసరం కన్నా ఎక్కువ మట్టి ఉన్నట్లు నిరభ్యంతర పత్రాలు ఇచ్చింది. వీటితో పాటు మరో 83 ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు తాత్కాలిక అనుమతులు పొందారు. గనుల శాఖ అనుమతులు ఇచ్చింది కేవలం 4.80లక్షల ఘనపు మీటర్ల గ్రావెల్‌ తవ్వకానికి మాత్రమే. కానీ ఇంకా నెలల తరబడి తవ్వకాలు జరుపుతున్నారు.

కోట్ల ఆదాయం:

పోలవరం కాలువ నూజివీడు మండలంలో జిల్లాలో ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి బాపులపాడు, ఆగిరిపల్లి, గన్నవరం, విజయవాడ గ్రామీణం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల మీదుగా పవిత్రసంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అనుమతులు ఇచ్చిన వాటికి క్యూబిక్‌ మీటరుకు రూ.45 చొప్పున గనులశాఖకు రాయల్టీ చెల్లిస్తున్నారు. నీటిపారుదల శాఖ కట్ట కావడంతో రూ.68 చొప్పున రాయల్టీ ఇస్తున్నారు. ఇలా భారీగా మట్టి తవ్వకాలు జరపడం వల్ల పోలవరం కాలువ గట్టు బలహీనంగా మారుతోంది. పలు చోట్ల గండ్లు కూడా పడ్డాయి. భారీ యంత్రాలు, టిప్పర్లు తిరుగుతున్నాయి. వీటి వల్ల కట్ట కుంగిపోయింది. లైనింగ్‌ ధ్వంసమైంది. పోలవరం కాలువ గట్లపై మట్టి తవ్వకాల రాయల్టీ గనుల శాఖ, జలవనరుల శాఖకు మొత్తం రూ.5.08కోట్లు ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు పడిన గండ్లు పూడ్చడానికి, కట్ట పటిష్ఠం చేయడానికి జలవనరుల శాఖకు మళ్లీ అంతే ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ తరలించిన మట్టితో రూ.కోట్లు కూడబెట్టారు. లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అదనంగా తరలిపోయింది.

పోలవరం కాలవ గట్టు అక్రమ తవ్వకాలు

రాత్రిపూట కూడా తవ్వకాలు:

అధికారికంగా ఇచ్చిన పరిమాణం కంటే అదనంగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది అనుమతి తీసుకున్న చోట కాకుండా వేరే చోట, మరికొంతమంది తవ్విన తర్వాత అనుమతులు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో తవ్వకాలు, తరలింపు పర్యవేక్షించడం లేదు. నూజివీడు మండలం పల్లెర్లమూడి, సీతారాంపురం, బాపులపాడు మండలం వేలేరు, రేమల్లె, వీరవల్లి, ఆగిరిపల్లి మండలం సూరవరం, గన్నవరం మండలం బలిపర్రు, గొల్లనపల్లి, విజయవాడ గ్రామీణ మండలం నున్న వద్ద ఇటీవల కాలంలో భారీగా తవ్వకాలు జరిగాయి. జాతీయ రహదారుల విస్తరణ పనులతో పాటు, ప్రైవేటు అవసరాలకు మట్టిని నిరంతరాయంగా తరలిస్తున్నారు. ప్రధానంగా 5, 6 ప్యాకేజీలలో తవ్వకాలు ఎక్కువుగా జరుగుతున్నాయి. రాత్రిపూట తవ్వకాలు పూర్తి నిషేధం. కానీ ఇక్కడ రాత్రిపూట కూడా జేసీబీలు పనిచేస్తున్నాయి. అధికారులు మాత్రం జాతీయ రహదారి విస్తరణ పనులకు ఈ అనుమతులు ఇచ్చామని చెబుతున్నారు. వాస్తవానికి ఇంకా విజయవాడ బైపాస్‌ పనులు ప్రారంభం కాలేదు. ఈ మట్టిని ప్రైవేటు వ్యాపారులు తరలిస్తున్నారనేది బహిరంగ రహస్యం.

"పోలవరం కుడికాలువపై మట్టి తవ్వకాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. మట్టిని తరలించేందుకు కొందరు అనుమతులు తీసుకుని సీనరేజి చెల్లించారు. జలవనరులశాఖ ఎన్​ఓసీ ఇచ్చిన తర్వాతే అనుమతులు ఇచ్చాం" -గనుల శాఖ సహాయ సంచాలకులు నాగిని

"అదనగా తవ్వకాలు జరపడం సాధారణమేనని తాను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. అదనంగా తవ్వకాలు జరిపిన ప్రాంతాలను పరిశీలించి జరిమానాలు విధిస్తాం. తాత్కాలిక అనుమతులు మాత్రమే ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరపరాదని హెచ్చరించాం" -గనుల శాఖ ఉప సంచాలకులు(ఎఫ్‌ఏసీ) సుబ్రహ్మణ్యం

ఇదీ చదవండి:'రైతులను.. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అప్పగించి చోద్యం చూస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details