POLAVARAM SURVEY : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి సంఘం లేఖ రాసింది. పోలవరం బ్యాక్ వాటర్‌పై ఉమ్మడి సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆ లేఖలో పేర్కొంది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యకార్యదర్శి పేరిట రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులకు ఈ లేఖలు అందాయి. రెండు రాష్ట్రప్రభుత్వాలు ఈ ఉమ్మడి సర్వేను సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ ఏడాది జనవరి 25వ తేదీన జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఆధారంగా చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. తెలంగాణతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించేందుకు సమ్మతి తెలిపినందున తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పీపీఏ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 25వ తేదీన కేంద్ర జలసంఘం నిర్వహించిన సమావేశంలో ఇరు పక్షాలు ఉమ్మడి సర్వేకు సమ్మతించాయని పీపీఏ సభ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ఉమ్మడి సర్వే అనంతరం పీపీఏతో పాటు, ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు చేపడతాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతకుముందు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం తదితర ప్రభావాలపై.. ఉమ్మడి సర్వే నిర్వహించాలన్న తెలంగాణ విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. సర్వే ఫలితాల ఆధారంగా.. అవసరమైన చర్యలను పోలవరం ప్రాజెక్టు అథార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటాయని జల సంఘం వెల్లడించింది. ప్రాజెక్టు వల్ల ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలతో జనవరి 25న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయగా.. ఏపీ, తెలంగాణ, ఒడిశాతో పాటు పోలవరం అథారిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను వెల్లడించింది. చర్చించిన అంశాలు, అభిప్రాయాలతో మినిట్స్‌ను జలసంఘం రాష్ట్రాలకు అందజేసింది. ఒడిశా లేవనెత్తిన అంశాలకు జలసంఘం వివరంగా సమాధానం తెలిపింది. ఆయా రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు గరిష్ఠ వరద ప్రవాహంపై మరోసారి అధ్యయనం చేయిస్తామని జలసంఘం ఛైర్మన్ ఓహ్రా వెల్లడించారు.