'మన్ కీ బాత్' కార్యక్రమంలో విజయవాడకు చెందిన శిల్ప కళాకారుడు పడకండ్ల శ్రీనివాస్ శిల్పాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం తెలుగు వారికి గర్వకారణమని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శ్రీనివాసును శాలువాతో కలెక్టర్ సన్మానించారు. తుక్కు ఇనుముతో చేసిన శిల్పాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని అన్నారు. పర్యావరణ మిత్రుడుగా చేస్తున్న ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందన్నారు.
పనికిరాని ఇనుప వస్తువులతో కళాఖండాలను సృష్టిస్తున్న శ్రీనివాస్ పేరు దేశ ప్రధాని మాన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జిల్లాకు, రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని అన్నారు. గుంటూరు, కర్నూలు, పులివెందుల పట్టణాలతో పాటు మదురై, చెన్నై, తిరునాళ్ళు వెళ్లి, మున్సిపల్ ప్రాంతాల్లో ఇనుప శిల్పాలను ఏర్పాటు చేశారని.. శ్రీనివాస్ శిల్పకళకు సజీవ సాక్ష్యాలుగా ఇవి నిలుస్తాయన్నారు. విభిన్న ఆలోచనలతో సృజనాత్మకత పెంపొందించే ఈ విధంగా రూపొందించిన ఇనుప శిల్పాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయని కలెక్టర్ అభినందించారు.