కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ప్లాస్మా వైద్యం అందించే ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమైంది. ఐసీఎంఆర్ పర్యవేక్షణలో ఈ ప్లాస్మా చికిత్స ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ద్వారా ప్లాస్మా సేకరించారు. ప్రస్తుతం కరోనాతో గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 30 మంది ఐసీయూలో ఉన్నారు. వీరిలో కొందరికి ప్లాస్మా వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే గాంధీకి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ప్లాస్మా వైద్యం ఎవరికి పడితే వారికి చేయడానికి వీలులేదు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్నవారికి ఈ వైద్యం అందించలేమని.. అలా అని కోలుకునే అవకాశం ఉన్న వారికి కూడా చేయలేమని గాంధీ వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉండి ఇబ్బంది పడుతూ కోలుకునేందుకు అవకాశం ఉండే రోగులకు మాత్రమే ప్లాస్మా వైద్యం అందిస్తారు.
ఐసీయూలో ఉన్న వారిలో..
గాంధీలో ఐసీయూలో ఉన్న వారిలో ఎంతమందికి ఈ చికిత్స అవసరముందన్న విషయాన్ని ఏ రోజుకారోజు వైద్యులు అంచనా వేస్తున్నారు. చికిత్స అందించాలనుకునే రోజు సంబంధిత రోగి ఆరోగ్య స్థితి ఆధారంగా ప్లాస్మా ఎక్కిస్తారని చెబుతున్నారు. కోలుకున్న వారి నుంచి రక్తం తీసుకునేందుకు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంది.