పీజీ మెడికల్, డెంటల్ కౌన్సెలింగ్లో కీలకమైన జీవో 43 , 89 లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మార్చింది . పాత జీవోలను సవరిస్తూ .. కొత్తగా జీవో 57 ,58 ను జారీ చేసింది . పీజీ మెడికల్ కు గత ఏడాది వరకు అమలు చేస్తూ వచ్చిన జీవో 43 స్థానంలో 57 , పీజీ డెంటల్ కు 89 స్థానంలో 58 జీవోలను సవరణలు చేసి విడుదల చేసింది . కొత్త జీవోల ప్రకారం.. మెరిటోరియస్ రిజర్వ్డ్ అభ్యర్థి స్లైడింగ్ విధానంలో వదులుకున్న సీట్లను తిరిగి అదే రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థికే కేటాయించేలా మార్పు చేశారు .
కళాశాల మార్పుతో పాటు స్పెషాలిటీని మార్చుకున్నప్పటికీ వారు ఓపెన్ కేటగిరీలో వదిలేసిన సీటు వారి రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. గత రెండేళ్లుగా దీనిపై వివాదం నడుస్తున్న క్రమంలో తాజాగా జీవోను సవరించారు . దీనివల్ల.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది.
ప్రభుత్వం పీజీ మెడికల్ విద్యార్ధుల కౌన్సిలింగ్కు నూతన జీవోలను జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పీజీ మెడికల్, డెంటల్ కౌన్సెలింగ్లో జీవో 43, 89 ప్రకారం.. మొదట నీట్ మార్కుల ఆధారంగా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిలో ఓసీలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా అన్ని రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులుంటారు . ఓపెన్ కేటగిరీలో 50 శాతం సీట్లు భర్తీ చేస్తారు. అనంతరం మిగిలిన రిజర్వేషన్ కేటగిరీ 50 శాతం సీట్లకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఓపెన్ కేటగిరీలో సీట్లు సాధించిన మెరిటోరియస్ రిజర్వ్డ్ అభ్యర్థికి అంతకంటే మెరుగైన వైద్య కళాశాలలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే.. అక్కడికి స్లైడింగ్ విధానంలో మారిపోతారు. వారు వదులుకున్న ఓపెన్ సీటును ఆ విద్యార్థికి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థితోనే భర్తీ చేయాలనేది జీవో 43 చెపుతుంది. అయితే.. వారు ఓపెన్ కేటగిరీలో ఏ స్పెషాలిటీలో సీటు తీసుకున్నారో అదే స్పెషాలిటీలోనికి స్లైడింగ్ ద్వారా వేరే కళాశాలకు మారినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది . అలాకాకుండా కళాశాల మార్పుతో పాటు స్పెషాలిటీని కూడా మార్చుకుంటే ఆ సీటును ఓసీ అభ్యర్థులకు కేటాయిస్తున్నారు . 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణలోనికి తీసుకుని ఈ మార్పులు చేసినట్టు కొత్త జీవోలో పేర్కొన్నారు .