నెలంతా కష్టపడి చివర్లో వచ్చే కొద్దిపాటి జీతంతోనే కాలం వెళ్లదీస్తున్న చిరుద్యోగులు, సామాన్యులు ఎంతో మంది ఉన్నారు మనదేశంలో. వారందరికీ... ప్రతిరూపాయి ఎంతో విలువైనదే, ఆస్తులు కూడబెట్టేందుకు కాకపోయినా కనీస అవసరాలు తీర్చుకునేందుకు కచ్చితంగా పొదుపు చేసుకోవాల్సిందే. కానీ... ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో విలవిల్లాడుతున్నారు సామాన్యులు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితులు లేకుండా పెరిగిపోతున్న చమురు ధరలతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ వస్తువైనా.. కొనుగోలు, తరలింపు, లాభం ఆధారంగా అంతిమ ధర నిర్ణయానికి వస్తుంది. కానీ.. అదేం విచిత్రమో.... ఈ లెక్కలకు, సూత్రాలను అందని తీరుగా ఎడాపెడా పెరిగిపోతుంటాయి దేశంలోని చమురు ధరలు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధరలు పెరిగినా, తగ్గినా... భారత్‌లో ధరలు మాత్రం కచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి తప్పా... ఎప్పటికీ తగ్గవు..
2015-16లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో పతనం నమోదయ్యింది. అప్పుడు దేశీయ చమురు ధరల్లో తగ్గుదల ఉండాల్సింది పోయి... పెరుగుదల నమోదయ్యింది. 2020లో కరోనా సమయంలోనూ ఇలాంటి పరిస్థితే చవిచూశారు దేశ వినియోగదారులు. కానీ... 2017లో ధరలు పెరిగినప్పుడు.. వాటికి అనుగుణంగా ధరలను అమాంతం పెంచేశాయి చమురు సంస్థలు. ఇలా...దిల్లీలోని పెట్రోల్, డీజిల్ ధరలను ప్రామాణికంగా చూస్తే... ఎటువంటి పన్నులు, వ్యాట్‌లు లేకుండా 2014 నాటికి పెట్రోల్ 47.12 రూపాయలకు లభించాలి. ఇదే.. లీటరు పెట్రోలు 2020 నాటి ధరలను అనుసరించి... 43 శాతం తగ్గుదల నమోదయ్యి 26.71 రూపాయలకు లభించాలి. కానీ వాస్తవంలో జరిగింది మాత్రం వేరు. బహిరంగ మార్కెట్లో.. అంటే ప్రభుత్వాల అన్ని రకాల పన్నులు ఈ కాలంలో 129 శాతం పెరిగాయి. అంటే... విపణిలో ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాల్ని వినియోగదారుకు దక్కకుండా.. మధ్యలోనే పన్నుల రూపేణా ఆ సొమ్మును తమ ఖాతాల్లో వేసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఈ వైఖరితో... అంతర్జాతీయంగా మరే దేశంలో లేనన్ని పన్నుల భారాన్ని మోస్తున్నారు భారతీయులు. ఈ విధానాల కారణంగా.. దేశ పౌరులు సగటున వారి ఆదాయాల్లో 17 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్‌పైనే వెచ్చిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి వివిధ అధ్యయనాలు..
ప్రస్తుతం దేశప్రజల కొనుగోలు సామర్థ్యం బాగా తగ్గిపోయింది. దాచుకున్న కొద్దిపాటి సొమ్ములు కొవిడ్ ఆంక్షల సమయంలో జీవనానికి, ఔషధాలకే పెద్ద మొత్తంలో ఖర్చయిపోయాయి.