పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని శాసనసభలో ఈ నెల 16న తిరిగి ప్రవేశపెట్టడాన్ని, వాటిని మండలికి పంపడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ బిల్లులను ఇప్పటికే శాసనమండలి సెలక్టు కమిటీకి సిఫారసు చేయగా మళ్లీ ఎలా ప్రవేశ పెడతారని ప్రశ్నిస్తూ తెదేపా ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బిల్లుల విషయంలో తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలకశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, శాసనసభ స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
రద్దు తీర్మానం.. రాజ్యాంగ విరుద్ధం
ఏపీ శాసన మండలిని రద్దు చేయాలని పార్లమెంట్‌ను విజ్ఞప్తి చేసూ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది ఎమ్మెల్సీల హక్కుల్ని ఉల్లంఘించేదిగా ఉందన్నారు. ఏపీ శాసనసభ చేసిన తీర్మానం ఆధారంగా పార్లమెంట్లో ఎలాంటి బిల్లు/చట్టం చేయకుండా కేంద్ర శాసనవ్యవహారాల శాఖ కార్యదర్శి, లోక్ సభ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.