కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో సుమారు 50 వేల మంది ప్రజలకు ప్రస్తుతం తాగునీరు అందక నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నందిగామ పక్కనే ఉన్న మునీర్‌లో పాత రక్షిత మంచినీటి పథకం గత వర్షాకాలంలో వచ్చిన వరదలకు దెబ్బతింది. దానికి ఇప్పటివరకూ మరమ్మతులు చేయించలేదు. ఫలితంగా తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది.
లీకై వృథాగా..
నందిగామకు ప్రతిరోజు 8.5 ఎంఎల్డీ సామర్థ్యం మేరకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 3 ఎంఎల్డీ మేరకే సరఫరా అవుతోంది. మరోవైపు పట్టణంలోనూ తాగునీటి పైపులైన్ సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల లీకై నీరు వృథాగా పోతోంది. నందిగామకు పూర్తిస్థాయిలో సాగునీరు, తాగునీరు సరఫరా చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.86 కోట్లు మంజూరు చేయగా టెండర్లు సైతం ఖరారు చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వం మారడంతో..
ప్రభుత్వ మారటంతో ఈ పనులకు పాత టెండర్లను రద్దు చేయడంతో పనులు ప్రారంభం కాలేదు. తిరిగి టెండర్లు పిలిచి రూ. 64 కోట్లతో ఖరారు చేశారు. ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఫలితంగా నందిగామ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. తాగునీటి సమస్య తీరాలంటే కృష్ణా నది నుంచి కొత్తగా సమగ్ర మంచినీటి అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేయాల్సిందే. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న తాగునీటి పథకాల ద్వారా సమస్య పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నందిగామ వాసులు కోరుతున్నారు.
అప్పటివరకు రెండు రోజులకోసారి..
తాగునీటి సమస్యపై నగర పంచాయతీ కమిషనర్ జయరాంను ఈటీవీ భారత్ వివరణ కోరగా వేసవిలో తాగునీటి సమస్య నివారణకు రూ. 95 లక్షలు అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వాన్ని సమర్పించినట్లు తెలిపారు. పాత మునేరు పథకానికి మరమ్మతులు చేస్తామన్నారు. ట్యాంకర్ల ద్వారా అప్పటి వరకు తాగునీరు సరఫరా చేస్తామని వెల్లడించారు. శాశ్వత మంచినీటి పథకం నిర్మాణ పనులకు టెండర్లు ఖరారు చేశామని.. వర్క్ ఆర్డర్ సైతం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నామని జయరాం చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి:
విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉక్కు నిర్వాసితులు