Krishna Bridge Issues: పులిగడ్డ వద్ద కృష్ణా నది రెండు పాయలుగా విడిపోయి.. ఒకటి హంసలదీవి వద్ద, మరోటి ఎదురుమొండి వద్ద సముద్రంలో కలుస్తాయి. ఎదురుమొండి వద్ద కృష్ణా నది సముద్రంలో కలిసే చోట.. నాగాయలంక మండలం, ఏటిమోగ వద్ద నది మధ్యలో ఉన్న దిబ్బలనే ఎదురుమొండి దీవులు అంటారు. ఎదురుమొండి, నాచుగుంట, బ్రహ్మయ్యగారిమూల, గొల్లమంద, ఏసుపురం, ఈలచెట్లదిబ్బ, జింకపాలెం గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో సుమారు 8 వేల మంది ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నారు. 3,756 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవుల్లో 1,985 కుటుంబాలకు బాహ్య ప్రపంచంతో ఉన్న ఏకైక మార్గం పంటు ప్రయాణం. అంతకు ముందు వరకు నాటు పడవలే దిక్కుగా ఉండేవి.
ప్రైవేటు పంటులతోనే ప్రయాణం
గతంలో ప్రభుత్వ సహకారంతో ఎదురుమొండి దీవులకు స్థానిక గ్రామ పంచాయతీ నిర్వహణలో ఓ పంటు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు సముద్రం నుంచి వచ్చిన రాకాసి అలల ధాటికి అది రెండు ముక్కలైంది. అప్పటి నుంచి ప్రైవేటు పంటు మాత్రమే వారికి ఆధారంగా మారింది. ప్రజల రవాణాకే కాదు, ద్విచక్రవాహనాల నుంచి వడ్లు మోసుకెళ్లే లారీలు, ట్రాక్టర్ల వరకు ఏ వాహనాన్ని ఒడ్డు దాటించాలన్నా ఈ పంటు మాత్రమే వారికి సాధనంగా ఉపయోగపడేది. ఏ క్షణాన ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోననే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.
వారధి నిర్మాణంతోనే సమస్యల పరిష్కారం...