ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ ప్రథమ పౌరుడు.. ప్రగతి రథచక్రాలను నడిపించే శక్తిమంతుడు - కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు వార్తలు

గ్రామానికి ప్రథమ పౌరుడంటే అభివృద్ధి కిరణాలను ప్రసరించే సూరీడు వంటివాడు. తన కనుసన్నల్లో ప్రగతి రథచక్రాలను నడిపించే శక్తిమంతుడు. ఆర్థిక వనరులను సృష్టించుకుంటూ.. ఆదాయాలను సకాలంలో రాబట్టుకుంటూ పల్లెకు పట్నపు శోభకు తీసుకురాగల యుక్తిపరుడు. అధికారంతో పాటు విధులు, బాధ్యతలను సమంగా.. సమన్వయంగా నెరవేర్చగలిగినప్పుడే అవన్నీ సాధ్యం. అలాంటి సర్పంచి పదవిని అలంకరించడానికి ఎందరో సమర్థులు గ్రామ సంగ్రామానికి సన్నద్ధమవుతున్న వేళ.. ఓసారి పల్లెను పలకరిద్దాం. తనలోని లోపాలను సరిదిద్ధి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించే ఊరు మనసు తడదాం.

people are waiting for sarpanch polls in krishna district
గ్రామ ప్రథమ పౌరుడు.. ప్రగతి రథచక్రాలను నడిపించే శక్తిమంతుడు

By

Published : Feb 6, 2021, 8:58 AM IST

సర్పంచి అంటే ఆర్థిక వనరులను సృష్టించుకుంటూ.. ఆదాయాలను సకాలంలో రాబట్టుకుంటూ పల్లెకు పట్నపు శోభకు తీసుకురాగల యుక్తిపరుడు. కృష్ణా జిల్లాలోని పల్లెలు.. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

శుద్ధజలం

మనిషి కనీస అవసరమిది. అయినా అందరికీ అందని ద్రాక్షగానే ఉంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య జటిలంగానే తయారైంది. శివారు ప్రాంతవాసులు ఏడాది పొడవునా గొంతు తడుపుకొనే భాగ్యానికి నోచుకోవడం లేదు. కొల్లేరు, ఉప్పుటేరు తీరాల గ్రామాలకు ఉప్పునీరే గతి. ఏరు దాటి తాగునీరు తెచ్చుకోవాల్సిన దయనీయంలోనే ఇప్పటికీ ఉన్నారు. ప్రధాన పట్టణాల్లోనూ అదే దుస్థితి నెలకొంది. ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన.. త్వరితగతిన పరిష్కరించాల్సిన ప్రధాన సమస్య ఇది.

వైద్యం

పేదలకు మెరుగైన వైద్యం అందాలంటే స్థానికంగా ఉన్న అసుపత్రుల్లో తగినన్ని సదుపాయాలు ఉండాలి. గ్రామీణులకు అందుబాటులో ఉండేది సర్కారు వైద్యశాలలే. వాటికి కమిటీలు ఉన్నప్పటికీ అవి నామమాత్రంగానే మిగిలిపోతున్న నేపథ్యంలో నూతన పాలకవర్గాలు వాటిపై దృష్టిసారించాలి. వైద్యులు, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ.. మందులు అందుబాటులో ఉండేలా ఆ శాఖ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. పార్టీలకతీతంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారా అవసరమైన వసతుల్ని కల్పించుకోవడానికి చొరవ చూపించాలి.

పారిశుద్ధ్యం

గ్రామీణ ప్రాంతాలు నేటికీ పారిశుద్ధ్యంలో అట్టడుగునే ఉన్నాయి. ఎక్కడా మురుగు కాలువలు, చెత్త నిర్వహణ సక్రమంగా కనిపించడం లేదు. గడిచిన పది నెలలుగా కొవిడ్‌తో ప్రమాదం నెలకొన్న నేపథ్యంలోనూ పారిశుద్ధ్య సమస్య వెక్కిరిస్తూనే ఉంది. వాడుకలో లేని బావులు, అపరిశుభ్రంగా ఉన్న కుంటలు, మడుగులను పూడ్చివేయాలి. డ్రెయినేజీల పూడికతీతపై శ్రద్ధ చూపాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు సంపద కేంద్రాల నిర్వహణను గాడిలో పెట్టాలి. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. శ్మశానవాటికల్లో వసతుల ఏర్పాటుపై శ్రద్ధ చూపాలి.

వీధి దీపాలు

గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణకు సాధారణ నిధుల నుంచి 15 శాతం వరకు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. రాత్రి వేళల్లో మూరుమాల పల్లెల్లో అధ్వానమైన రహదారులు, పక్కన ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, వాటిలో సంచరించే విషపురుగుల బెడద ఎక్కువే. ఎప్పటికప్పుడు పనిచేయని దీపాలను మార్చడం.. ఇతర మరమ్మతులు చేయించడం.. కిందకి జారిన తీగలు సరిచేయించడానికి విద్యుత్తు శాఖ అధికారులతో సంప్రదించడం వంటి చర్యలు పల్లెల్ని దేదీప్యమానంగా వెలుగొందించేందుకు దోహదపడతాయి.

అంతర్గత రహదారులు

రహదారుల అభివృద్ధికి ఆనవాళ్లు వంటివి. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గతంలో కొన్నిచోట్ల నిధులు కేటాయించడం.. ప్రభుత్వం మారడంతో అవి నిలిచిపోవడం.. కొత్తగా నిధులు మంజూరుకావడం.. ఇలా రోడ్ల నిర్మాణ ప్రక్రియ కుంటుపడింది. నూతన పాలకవర్గం వీటికి రెక్కలు తొడగాలి. పల్లెవీధుల రూపురేఖల్ని మార్చుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి.

స్వయం ఉపాధి

కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి మహిళలు తమవంతు పాత్రను పోషిస్తున్నారు. వారిని మరింత ప్రోత్సహించేదిశగా స్థానిక సంస్థల ప్రతినిధులు చర్యలు చేపట్టాలి. స్వయంశక్తితో ఎదగడానికి ఆసక్తి చూపేవారిని బృందాలుగా చేయడం, వారి నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం కల్పించడం ద్వారా కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలి. వారు తయారు చేసిన ఉత్పత్తులను వారే విక్రయించుకునే ఏర్పాట్లు చేయాలి. యువతకు నైపుణ్య శిక్షణనిప్పించి.. వారిని ఉపాధి రంగంవైపునకు నడిపించాలి.

ఇదీ చదవండి:

పంచాయతీల్లో ఏకగ్రీవాలు..పదవుల పంపకంపై అనధికారిక ఒప్పందాలు !

ABOUT THE AUTHOR

...view details