ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

power cuttings in AP : కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో..! రాష్ట్రంలో అనధికారిక విద్యుత్ కోతలు - Electric poles transformers

Unannounced power cut : రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనం అల్లాడుతున్నారు. మండు వేసవిలో కరెంటు లేక ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం ఉంది. అసలు నిర్దిష్టంగా కరెంటు ఎప్పుడు తీస్తారో... తీశాక ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. అప్రకటిత కరెంటు కోతలకు నిరసనగా జనం రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 19, 2023, 7:32 AM IST

రాష్ట్రంలో అనధికారిక విద్యుత్ కోతలు

Unannounced power cut : అసలే భానుడి భగభగలు.. దానికి తోడు విద్యుత్తు కోతలు... ఫలితంగా భరించలేని వేసవి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతకు ఇళ్లల్లో ఉండలేక బయటకు రాలేక నరకయాతన పడుతున్నారు. పల్లెల్లో సమయపాలన లేని కరెంట్ కోతలపై జనం మండిపడుతున్నారు. విజయవాడలో అధికారికంగా ఎక్కడా కోతలు లేకపోయినా ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో 2నుంచి 3 గంటల వరకూ విద్యుత్‌ ఉండడం లేదు. సరఫరాలో లోటు ఏర్పడినప్పుడల్లా అధికారులు కోతలు పెడుతున్నారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్యకళాశాలలో గురువారం హఠాత్తుగా కరెంటు పోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి... గురువారం వీటీపీఎస్​ లో సాంకేతిక లోపంతో పరిస్థితి దిగజారింది. కంచికచర్ల, పామర్రు, పెనుగంచిప్రోలు, తిరువూరు, మైలవరం పల్లెల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరుతో.. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల పాటు కోత విధించారు. గుడివాడలోని చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10 గంటల తర్వాత విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎంతకీ రాకపోవడంతో జనం ఏలూరు రోడ్డులోని విద్యుత్ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్‌ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఉప కేంద్రం వద్దకు వచ్చి సర్థి చెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. కరెంటు వచ్చిన తర్వాతే ఇళ్లకు వెళ్లారు.

ఏలూరు జిల్లాలో రైతుల ఆందోళన..విద్యుత్ కోతలను నిరసిస్తూ ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడులో విద్యుత్ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. ఏఈ రాంబాబుని నిలదీశారు. రాత్రి వేళల్లో సరఫరాలో లోపంతో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు వాపోయారు. ఇకపై కోతలు లేకుండా చూస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

పరిశ్రమలకూ తప్పని కోతలు.. అనకాపల్లి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 4 రోజులుగా.. విద్యుత్‌కు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో సూక్ష్మ, మధ్య, భారీ తరహా పరిశ్రమలకు రోజుకి 130 నుంచి 140 మెగా వాట్ల విద్యుత్ అవసరం ఉండగా 120 మెగా వాట్లే సరఫరా అవుతోంది. దీని వల్ల కోతలు విధించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతలతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

సీఎం జిల్లాలోనూ ఇదే పరిస్థితి.. సీఎం జగన్ సొంత వైఎస్సార్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. కడపలో హౌసింగ్ బోర్డు కాలనీ, రాజీవ్ పార్కు మార్గ్, ఎంజీకుంట, ప్రకాష్ నగర్, మారుతీనగర్‌లో గురువారం అప్రకటిత విద్యుత్‌ కోతలు అమలు చేశారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు మార్చడం కోసం సరఫరా ఆపేశామని అధికారులు చెప్తున్నా... మరి రోజూ ఎందుకు కోతలు పెడుతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details