Payyavula Keshav on Budget : జగన్‌ది శ్రీలంక ఎకనామిక్స్.. పాకిస్థాన్ పాలిటిక్స్ అని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎకనామిక్స్ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎదురు చూస్తోందని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి బుగ్గన వాస్తవాలకు దూరంగా మాయా ప్రపంచం చూపించారని విమర్శించారు. మాటలు కోటలు దాటుతూ, చేతలు గడప దాటట్లేదనటానికి నీటి పారుదల రంగంలో కేటాయింపులు, ఖర్చులే ఓ ఉదాహరణ అని దుయ్యబట్టారు.
వృద్ధి రేటు పెరిగితే ఆదాయం ఎందుకు పెరగడం లేదో.. నీటిపారుదల రంగానికి నాలుగు ఏళ్లలో 10వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ రంగానికి చేసిన కేటాయింపుల్లో 90శాతానికి పైగా ఖర్చు చేశామని గుర్తు చేశారు. వృద్ధి రేటు పెరిగితే ఆదాయం ఎందుకు పెరగడం లేదో సమాధానం చెప్పాలన్నారు. వృద్ధి రేటు పెరిగినా విచిత్రంగా ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగాయని మండిపడ్డారు. జగన్ ఓసారి నేల మీద నడిస్తే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయని, ఓసారి నడిచినందుకు ఏపీ చాలా ఇబ్బందులు పడుతోందని దుయ్యబట్టారు. జగన్ నేల మీద నడిస్తే.. ప్రజలు పరదాల చాటుకు పోతారని.., జగన్ నేల మీద నడవొద్దని కోరుకుంటున్నాం.. గాల్లో ప్రయాణిస్తేనే అందరికీ మంచిదని వ్యాఖ్యానించారు.
జగన్ పేదరికాన్ని నిర్మూలించడం కాదు.. పేదలను నిర్మూలిస్తున్నాడు.. గత ఎన్నికల్లో జగన్ క్యాస్ట్ వార్ చేశాడు. ఈ ఎన్నికల్లో క్యాష్ వార్ చేసేందుకే సిద్ధమవుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో క్యాష్ వార్ జరగదు.. పెర్పార్మెన్స్ వార్ జరుగుతుంది. - పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, టీడీపీ నేత