శ్రీనివాస్ రెడ్డి మృతిపై స్పందించిన జనసేనాని - ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి
తెలంగాణలోని ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మబలిదానంపై జనసేన అధినేత పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి వారిని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మబలిదానం తీవ్రంగా కలచివేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని చింతించారు. ఖమ్మం బస్సు డిపోలో ఆత్మహత్యకు ప్రయత్నంచినప్పుడే ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడితే ఈ దారుణం జరిగేది కాదని అన్నారు. తన భార్య, పిల్లల ఎదుటే ఆయన మంటల్లో దహించుకుపోవడం... తలచుకుంటేనే గుండె బరువెక్కుతుందన్నారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఆయన ఆర్టీసీ కార్మికుల బాగోగుల గురించే ఆలోచించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోరుకున్న తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం శోచనీయమన్న పవన్...శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఆయన లోటు తీర్చగలమా అని ప్రశ్నించారు. తక్షణం ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ కార్మికులలో ధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఆత్మబలిదానాలకు పోవద్దని కార్మికులందరికీ పవన్ విజ్ఞప్తి చేశారు.