రాష్ట్రంలో తుపాన్లతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం పాతిక వేల పరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కౌలు రైతులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సహా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా పెనమలూరు నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను పవన్ పరిశీలించారు. ఉయ్యూరులో నీట మునిగిన వరి పొలాన్ని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్‌ను కలసిన రైతులు నష్టపోయిన పంటలను చూపించారు. తమ కష్టాలను పవన్‌తో చెప్పుకొన్నారు. నివర్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని.. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యే తండ్రి
పెద్దపూడి అడ్డ రోడ్డు వద్ద పవన్ కల్యాణ్‌ను వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య కలిశారు. తుపానుతో రైతులు చాలా దారుణంగా నష్టపోయారని.. ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని పవన్‌కు తెలిపారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలు.. అంతా తప్పులేనని, ప్రస్తుతం చేస్తుందంతా మోసమే అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదన్న కె.పి.రెడ్డయ్య.. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని పవన్‌ను కోరారు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
అనంతరం పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పొలాల్లోకి దిగి పంటల పరిస్థితిని పవన్ పరిశీలించారు. ఎకరాకు ౩౦వేల వరకు ఖర్చు పెట్టామని.. నివర్ తుపానుతో సర్వం నష్ట పోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పొలాల్లోంచి నీరు బయటకుపోలేదని.. తమకు ప్రభుత్వం సాయం అందించడం లేదని వాపోయారు. వైకాపానేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.