రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా జబ్బును దాచేస్తే దాగదని.. అది ముదిరి మరింత భయపెడుతుందని అన్నారు. కర్నూలు జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ చేశారు. జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల, లాక్ డౌన్ పరిణామాలపై చర్చించారు.
కరోనా వ్యాప్తి ఎవరూ ఊహించని ఉత్పాతమన్నారు. ఈ మహమ్మారి మూలంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగానే నియంత్రణ చర్యలు చేపట్టారని చెప్పారు. కరోనా వ్యాప్తి విషయాన్ని మతం కోణంలో చూడటం తగదని.. ఎవరికీ ఆపాదించవద్దని కోరారు. ఈ సమయంలో రాజకీయాల కంటే ప్రజల కష్టాలు తీర్చేలా పని చేయడం ముఖ్యమని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.