రాష్ట్రంలో అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే స్పందించని పవన్ కల్యాణ్... ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విచారణలో జగన్, అతనికి సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉంటే అప్పుడే కేసు నమోదు చేసేవారన్నారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చేసిన పవన్, ఎవరో రాసిచ్చిన డైలాగులు, స్క్రిప్టులు చదువుతున్నారని ఎద్దేవా చేశారు.
కృష్ణా జిల్లా నందివాడ తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయకుమారి మంత్రి కొడాలి నాని సమక్షంలో వైకాపాలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... తెదేపాకు రాజీనామా చేసి వైకాపాలో చేరారు. విజయతోపాటు మరికొందరు తెదేపా కార్యకర్తలు వైకాపా గూటికి చేరారు.