Janasena 10th Formation Day :వచ్చే ఎన్నికల్లో గెలిచి కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. గెలుస్తామనే నమ్మకం ఉంటే ఒంటరి పోటీకి సిద్ధమంటూనే.. ప్రయోగాలు మాత్రం చేయబోమని తేల్చిచెప్పారు.
పరోక్షంగా పొత్తులు ఉంటాయనే సంకేతాలిచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ వైసీపీ రెచ్చగొడుతున్నా.. వారి ఉచ్చులో చిక్కబోమని స్పష్టం చేశారు. జనసేన నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుందని.. పదో ఆవిర్భావ సభావేదిక నుంచి పవన్ ప్రకటించారు.
జనసేన పదో ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఆవిర్భావానికి కారణాలు, సిద్ధాంతాలను జనసేనాని పవన్‌కల్యాణ్ వివరించారు. పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు పడ్డామన్న ఆయన... అన్నింటినీ దిగమింగి పార్టీ అభివృద్ధి కోసం నిలబడ్డామని చెప్పారు.
ఒక్కడిగా ప్రారంభమైన జనసేన.. ఆరున్నర లక్షల క్రియాశీల కార్యకర్తల స్థాయికి ఎదిగిందన్నారు. ప్రజల మద్దతు కొనసాగితే ఏదో ఒకరోజు జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పవన్.. కులాల పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
"వచ్చే ఎన్నికల్లో ఒకటి జరగకూడదని వైసీపీ కోరుకుంటోంది. 175 స్థానాల్లో పోటీ చేయాలని మాకు సవాలు విసురుతోంది. కానీ ఏం జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో నాకు తెలుసు.. కచ్చితంగా అదే జరుగి తీరుతుంది. ఓటును వృథా కానివ్వం. జనసేన సత్తా చాటుతాం. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో మా పార్టీది బలమైన సంతకం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం"-పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
సమాజంలోని అన్ని కులాలను కలుపుకొని వెళుతూ.. కాపులు పెద్దన్నపాత్ర పోషించాలని పవన్‌కల్యాణ్ పిలుపిచ్చారు. దేశానికి ఓ సమర్థ నేత ప్రధాని ఉండాలనే సంకల్పంతో మోదీకి మద్దతిచ్చినట్లు పవన్‌కల్యాణ్ తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలపై మాట తప్పినందునే కొంతకాలం భాజపాతో విభేదించినట్లు చెప్పారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఏడాదిగా ఎందుకు చెబుతున్నదీ వివరించారు.
"గత ఎన్నికల్లో గెలవకుండానే ఇన్ని పోరాటాలు చేశాం. మీరు మాకు ఓటేసి గెలిపిస్తే ఇంకా ఎంతగా చేస్తామో గుర్తించి అండగా ఉంటారని భావిస్తున్నా. వచ్చే ఆవిర్భావ సభను ఎన్నికల్లో గెలిచి చేసుకుందాం. కేవలం నినాదాలు, నోటి మాటలపై ఆధారపడకుండా.. రీసెర్చి, తగినంత డేటా, రిపోర్టులు తెప్పించుకున్నాక, జనసేన కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం కుదిరితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికీ వెనుకాడబోం"-పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
క్షేత్రస్థాయిలో బలం ఉండి గెలుస్తామంటే ఒంటరి పోరుకు సిద్ధమంటూనే.. అలాగని ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా లేమని పవన్ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని సంకేతాలిచ్చారు. ఈసారి కచ్చితంగా జనసేన అసెంబ్లీలో అడుగు పెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: ప్రసంగానికి ముందు స్వాతంత్య్ర సమర యోధుల చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. 47 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. తన కోసం ప్రత్యేకంగా చెప్పులు తయారు చేస్తున్న తెనాలి వెంకటేశ్వరరావుకు లక్ష రూపాయల సాయం చేశారు.
విజయవాడ నుంచి కనుమూరు వరకు ర్యాలీ: అంతకుముందు.. విజయవాడ ఆటోనగర్ నుంచి కనుమూరు వరకు.. వారాహి వాహనంలో పవన్ కల్యాణ్ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం వరకు ర్యాలీ సాగాల్సి ఉన్నా.. సమయం మించిపోతుడంతో కారులో సభకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో జనసైనికులు బైకులు, కార్లలో పవన్‌కల్యాణ్‌ను అనుసరించారు.
ఇవీ చదవండి: