ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pattabi: 'మైలవరం వీరప్పన్​గా వసంత కృష్ణప్రసాద్ చరిత్రలో నిలిచిపోతారు'

అక్రమ మైనింగ్​పై తాము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సరైన సమాధానం చెప్పలేదని తెదేపా నేత పట్టాభి విమర్శించారు. మైలవరం వీరప్పన్​గా వసంత కృష్ణప్రసాద్ చరిత్రలో నిలిచిపోతారని దుయ్యబట్టారు. అటవీ భూముల్ని రెవెన్యూ భూములుగా మార్చింది ముమ్మాటికీ జగన్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు.

pattabi comments on mla vasanta krishna prasad over mining
మైలవరం వీరప్పన్​గా వసంత కృష్ణప్రసాద్ చరిత్రలో నిలిచిపోతారు

By

Published : Aug 2, 2021, 6:53 PM IST

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైలవరం వీరప్పన్​గా చరిత్రలో నిలిచిపోతారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. చేసిన దొంగతనాలు బయటపడేసరికి తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అటవీ భూముల్ని రెవెన్యూ భూములుగా మార్చింది ముమ్మాటికీ జగన్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు. అక్రమ మైనింగ్​పై తాము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ కృష్ణప్రసాద్ సరైన సమాధానం చెప్పలేదని విమర్శించారు. చెప్పటానికి తగిన ఆధారాలు లేక సగంలోనే మీడియా సమావేశం విరమించుకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. సర్వే నెంబర్ 143పై హైకోర్టు కాపీని తొక్కిపెట్టడంతో పాటు అది తన తాతల కాలం నుంచి ఉందని అసత్యాలు చెప్పే ప్రయత్నం చేశారని పట్టాభి మండిపడ్డారు.

ఆధారాలున్నాయి

143 సర్వే నెంబర్​ను సృష్టించారని హైకోర్టు స్పష్టం చేయటంతో పాటు విలేజ్ మ్యాప్​లోనూ, ఫీల్డ్ మెజర్​మెంట్ బుక్​లోనూ లేదనే అధారాలు తమ వద్ద ఉన్నాయని మీడియా ముందు బయటపెట్టారు. 2019 అక్టోబర్ 17న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్​తో రెవెన్యూ భూములుగా మారుస్తూ ఆర్డర్ ఇప్పించారని ఆరోపించారు. దీనిపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించిన నాటి కృష్ణా కలెక్టర్ అనుమతులు రద్దు చేయిస్తే.. ఉషారాణి ద్వారా స్టే తెచ్చుకున్నారన్నారు. తనకు రాజయోగం, ధనయోగం ఉందని చెప్పుకుంటున్న వసంత కృష్ణప్రసాద్​కు త్వరలోనే జైలుయోగం ఉందని మండిపడ్డారు.

ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వాదన

కొండపల్లి మైనింగ్​పై తెదేపా నేత పట్టాభి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అబద్ధాలను నిజం చేయాలని తెదేపా నేతలు ప్రయత్నించటం దారుణమన్నారు. వైఎస్ హయాంలో లోయ గ్రామంలో 143 సర్వే నెంబర్​ను సృష్టించారని పట్టాభి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. 1993 లోనే ఓ వ్యక్తి 143 సర్వే నెంబర్​లో మైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారని గుర్తు చేశారు. 1943-44 లో రూపొందించిన ఆర్​ఎస్​ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉందన్నారు. 143 సర్వే నెంబర్ ఎప్పటి నుంచో ఉందనటానికి పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. 45 ఏళ్లుగా లోయ ప్రాంతంలో మైనింగ్ జరుగుతోందని..,అక్కడ అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. లోయలో గత ప్రభుత్వంలో ఇచ్చిన విచారణ నివేదికల ప్రకారమే మైనింగ్​ అనుమతులు ఇచ్చారన్నారు.

చూస్తూ ఊరుకోబోం..

తనపై బురద జల్లడమే లక్ష్యంగా దేవినేని ఉమా ఏడాదిన్నరగా పనిచేస్తున్నారన్నారని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రాజధాని అమరావతిలో రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తుందనే ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తున్నట్లైతే..ఆధారాలతో బయటపెట్టాలన్నారు. స్పిన్నింగ్ మిల్లులకు ఆర్థికసాయం చేయిస్తామని గత ప్రభుత్వ హయంలో ఎంఎస్ఎంఈల నుంచి ఇద్దరు మంత్రులు రూ. 9 కోట్లు తీసుకుని మోసం చేశారని కృష్ణప్రసాద్ ఆరోపించారు. తెదేపా నేతలు అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని..,త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయంలో తనపై అక్రమంగా ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశారన్నారు. అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.

ఇదీ చదవండి

చర్చనీయాంశంగా కొండపల్లి మైనింగ్‌ వివాదం.. మరోసారి సర్వేకు పట్టు

ABOUT THE AUTHOR

...view details