రాష్ట్రంలోని వివిధ డెయిరీలకు చెందిన రూ.750 కోట్ల ఆస్తులను అమూల్ కు కట్టబెట్టేందుకే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు తప్ప.. కొవిడ్ నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కాదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. వివిధ డెయిరీలకు చెందిన దాదాపు రూ.750 కోట్ల ఆస్తులను కేవలం రూ.3.38కోట్లకు కట్టబెట్టడం.. దేశంలోనే అతిపెద్ద డెయిరీ కుంభకోణమని అన్నారు. ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా జరిగిన ఈ అక్రమ ఒప్పందం క్విడ్ ప్రోకోలో భాగమేనని అన్నారు.
టెండర్ ప్రక్రియ లేకుండా జరిగిన ఒప్పందం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గం అజెండాలో 33 అంశాలు పెడితే చిట్టచివరి అంశంగా కరోనా నియంత్రణ అంశాన్ని చేర్చారని పట్టాభిరామ్ ఆరోపించారు. అందులో రూ. 45.68 కోట్లతో కేవలం రూ.13.30 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. 5 కోట్ల జనాభాకి 13లక్షల వ్యాక్సిన్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు.