ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Mahanadu: రెండోసారి ఆన్లైన్ మహానాడు... ప్రపంచ వ్యాప్తంగా పసుపు పండుగ - 35వ మహానాడును సమష్టిగా జయప్రదం చేయాలి : చంద్రబాబు

ప్రజా సమస్యలపై చర్చే ప్రధాన అజెండాగా నేటి నుంచి రెండు రోజుల పాటు తెదేపా మహానాడు నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఏటా మూడు రోజులపాటు అట్టహాసంగా జరిగే మహానాడుని... కరోనా ఉద్ధృతి కారణంగా వరుసగా రెండో ఏడాదీ వర్చువల్‌గానే నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ‘డిజిటల్‌ మహానాడు’లో భాగస్వాములవ్వాల్సిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, దేశ, విదేశాల్లోని పార్టీ అభిమానులను తెదేపా అధినేత చంద్రబాబు ఆహ్వానించారు.

రెండోసారి ఆన్లైన్ మహానాడు... ప్రపంచ వ్యాప్తంగా పసుపు పండుగ
రెండోసారి ఆన్లైన్ మహానాడు... ప్రపంచ వ్యాప్తంగా పసుపు పండుగ

By

Published : May 27, 2021, 5:04 AM IST

Updated : May 27, 2021, 7:53 AM IST

మే మాసం అంటేనే తెలుగుదేశం శ్రేణులకు పండుగ నెల. పార్టీ అతిపెద్ద వేడుక మహానాడును ఈ నెలలోనే మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీ. మూడున్నర దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మహనాడు ఓ కీలక ఘట్టం. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులతో ప్రతీ సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో మహనాడు నిర్వహించడాన్ని సంప్రదాయంగా పాటిస్తున్నారు.

ప్రతి అంశం అత్యంత ప్రతిష్టాత్మకం..

మహానాడు రెండో రోజు పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుక నిర్వహణకు ప్రాంగణం ఎంపిక మొదలుకొని ప్రతనిధులకు రుచికరమైన భోజనాలు వడ్డించే వరకూ ప్రతి అంశాన్ని పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇందుకు నెల రోజులు ముందు నుంచే ఏర్పాట్లకు సంబంధించి పెద్ద కసరత్తే జరుగుతుంది.

ఏటా సుదీర్ఘ కసరత్తు..

సాధారణంగా మహనాడు నిర్వహించాలంటే కనీసం మూడు వారాల నుంచి నెలరోజులు సమయం కావాలి. అంత సమయం ఉంటేనే మూడు రోజులపాటు మహనాడును ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం సాధ్యం. ప్రాంగణం మొదలుకొని స్టేజీ ఏర్పాటు, ప్రతినిధులకు పిలుపు, రిజిస్ట్రేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, అధినేత సందేశం, అంశాల వారీగా తీర్మాణాలు, అతి కీలకమైన రాజకీయ తీర్మానం వంటి విషయాల్లో పార్టీ సుదీర్ఘ కసరత్తు ఏటా నిర్వహిస్తుంది.

35వ మహానాడు..

కరోనా ప్రభావం, కర్ఫ్యూ నిబంధనల కారణంగా మహానాడు గతేడాది, ఈసారి రెండు రోజులకే పరిమితం చేశారు. అదీ ఆన్లైన్​లో మాత్రమే. ఫలితంగా ఈసారి కూడా డిజిటల్ వేదికగానే మహానాడు జరగనుంది. ప్రతిసారీ నిర్వహించే భారీ బహిరంగ సభలా కాకుండా వరుసగా రెండో సారి వర్చువల్‌ మీడియా వేదికగానే మహానాడు సిద్ధమైంది. తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ మహానాడుకు అమరావతి ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటి వరకూ మొత్తం 34 సార్లు మహానాడు వేడుక నిర్వహించగా.. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ మహానాడు 35వ వేడుక.

హైదరాబాద్ నుంచే అధినేత ప్రసంగం..

మధ్యలో వచ్చిన కొన్ని అవాంతరాలు మినహా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి సందర్భంలోనూ మహనాడు నిర్వహిస్తూనే వచ్చారు. ప్రస్తుత మహానాడుతో కలుపుకుని అమరావతి వేదికగా ఆరుసార్లు పసుపు పండుగ నిర్వహించారు. అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచే ఆన్లైన్ ద్వారా వేడుకలో పాల్గొంటున్నా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి మొత్తం డిజిటల్ వ్యవస్థ పనిచేయనుంది.

తొలి రోజు ఆరు తీర్మానాలు

ఈ ఉదయం 10 గంటలకు అభ్యర్థుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మహానాడుకు ఆహ్వానం పలకగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, మా తెలుగు తల్లి గీతాలాపన చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన పార్టీ శ్రేణులకు సంతాప తీర్మానం అనంతం అధినేత చంద్రబాబు స్వాగతోపన్యాసం ఉంటుంది.

ఏపీ అంశాలు..

అనంతరం ఏపీకి సంబంధించి కొవిడ్ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలు తలకిందులైన కుటుంబ ఆదాయం, రాష్ట్రంలో ఉగ్రవాదం, న్యాయ ఉల్లంఘన, ప్రజాస్వామ్యం- వెనకడుడు, అదుపులేని ధరలు పెంచిన పన్నులు అప్పులు, పరిశ్రమలపై దాడులు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి నాలుగు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. తెలంగాణకు సంబంధించి రెండు తీర్మానాలు ఉంటాయి.

తెలంగాణ అంశాలు..

తెలంగాణకు సంబంధించి వ్యవసాయ సంక్షోభం-సమస్యల సుడిలో అన్నదాత, సంక్షేమానికి కోతలు- మారని బడుగు బలహీన వర్గాల తలరాతల పేరిట రెండు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు..

తెలుగు దేశం నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడులో భాగంగా రాజకీ️య, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలు సహా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాలపై చర్చ జరుపనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. రెండు రోజల మహానాడులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటడించారు.

తొలి రోజు సంతాప తీర్మానాలతో మొదలు..

మహానాడు తొలి రోజు.. ఏడాది కాలంలో మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాప తీర్మానాలతో కార్యక్రమం మొదలవుతుంది. తొలి రోజు ఏపీకి సంబంధించి 4, తెలంగాణకు సంబంధించి 2 తీర్మానాలు ప్రవేశపెడతారు. కరోనా వ్యాప్తి, శాంతి భద్రతలు, పెంచిన పన్నులు, అప్పులు, అదుపులేని ధరలు, పరిశ్రమలపై దాడులు, అమరావతి సంపద విధ్వంసం వంటి అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ కోసం..

తెలంగాణకు సంబంధించి వ్యవసాయ సంక్షోభం, సంక్షేమానికి కోతలు వంటి అంశాలపై చర్చించనున్నారు.

రెండో రోజు నటసార్వ భౌముడికి నివాళులు..

రెండో రోజు మహానాడులో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ తీర్మానం ప్రవేశపెడతారు. ఏపీకి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగం పరిస్థితి, సంక్షేమం నకిలీ రత్నాలు అన్న అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదిస్తారు.

చివర్లో చంద్రబాబు ప్రసంగం..

తెలంగాణకు సంబంధించి ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు, కుదేలైన విద్యారంగం, కొరవడిన మహిళా వికాసం వంటి అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. రెండో రోజు మధ్యాహ్న భోజన విరామ సమయానికి ముందు.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభాగాల అధ్యక్షులు ప్రసంగిస్తారు. రెండో రోజు చివర్లో రాజకీ️య తీర్మానం ప్రవేశపెడతారు. ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు, తెలంగాణ నుంచి రావుల చంద్రశే️ఖర్‌రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం చంద్రబాబు ప్రసంగంతో కార్యక్రమం ముగుస్తుంది.

ఇవీ చూడండి :నేడే మహానాడు : పసుపు సైనికులకు డిజిటల్ ఆహ్వానం

Last Updated : May 27, 2021, 7:53 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details