ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికలు - ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు

రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. గతేడాది మార్చి 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. కరోనా వల్ల ఆ పక్రియ నిలిచిపోయింది. ఏడాది తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 2 కోట్ల 46 లక్షల పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఈసీ వెల్లడించింది.

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం
పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం

By

Published : Apr 8, 2021, 1:41 AM IST

Updated : Apr 8, 2021, 6:01 AM IST


రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ...126 ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోగా...పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన 11 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2 వేల 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలుండగా... 2వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.

అభ్యర్థులు మరణించిన 81 చోట్ల ఎన్నికలను వాయిదా వేశారు. మిగిలిన 7వేల 220 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 18 వేల 782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 7 వేల 735 పరిషత్ స్థానాలకు ఉదయం 7గంటల నుంచి ...సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఎన్నిక ముగియనుంది. 2 కోట్ల 46 లక్షల 71 వేల 2 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి....
ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 27 వేల 751 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో 6 వేల 492 సున్నిత పోలింగ్ స్టేషన్లు కాగా....అతి సున్నితమైనవి 6వేల 314 కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. 247 స్టేషన్లను నక్సల్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్న అధికారులు....వీటిల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 43 వేల 830 పెద్ద బ్యాలెట్‌ బాక్సులు, 12వేల 898 మధ్యరకం, 46 వేల 502 చిన్న తరహా బాక్సులను ఎన్నికల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. 652 మంది రిటర్నింగ్ అధికారులు, 1091 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను ఎన్నికల కోసం నియమించామన్నారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు 6 వేల 524 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు ఎస్ఈసీ వెల్లడించింది.

కొవిడ్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు...
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బందికి మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ గ్లోవ్స్ అందించినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో భౌతిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎవరైనా కొవిడ్‌ పాజిటివ్ ఉన్న వారు ఉంటే వారికి పీపీఈ కిట్లు అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కొవిడ్‌ ఉన్న వారు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 'అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'

Last Updated : Apr 8, 2021, 6:01 AM IST

ABOUT THE AUTHOR

...view details