కృష్ణా జిల్లాలో పంచాయతీ పోరుకు తెరలేచింది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్టేజి1, స్టేజి2 అధికారులను నియమించారు. పంచాయతీ ఎన్నికలు జిల్లాలో నాలుగు విడతలుగా జరగనున్న విషయం తెలిసిందే. తొలివిడతలో కీలకమైన నాలుగు నియోజకవర్గాల్లోని పంచాయతీలకు పోరు జరుగనుంది. రాజకీయంగా చైతన్యవంతమైన ఈ నియోజకవర్గాల్లో పోరు నువ్వానేనా అన్నట్లు సాగనుంది. తొలివిడతలో జరిగే 234 పంచాయతీల్లో 12 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా విజయవాడ గ్రామీణ మండల పరిధిలోనివే. ఇవి గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. దీంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
వీటికి ఎన్నికలు లేవు..!
విజయవాడ డివిజనులో మొత్తం ఏడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. 96 వార్డులకు జరపడం లేదు. దీనికి కారణం కొత్త పంచాయతీలుగా ఆవిర్భవించడం, రిజర్వేషన్ పూర్తికాకపోవడంతో నిలిపివేశారు. గతంలో ఉన్న గొల్లపూడి మేజర్ పంచాయతీని నాలుగు పంచాయతీలుగా విడగొట్టారు. విజయవాడలో అంతర్భాగంగా ఉన్న ఈ పంచాయతీని గ్రేటర్ విజయవాడలో కలిపేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా నాలుగు పంచాయతీలు చేశారు. గొల్లపూడి, జక్కంపూడి, వైఎస్సార్ పంచాయతీ, రామరాజ్యనగర్ పేరుతో ఏర్పాటు చేశారు. గొల్లపూడి, వైఎస్సార్ పంచాయతీలో 20 చొప్పున వార్డులు మిగిలిన రెండు పంచాయతీల్లో 10 చొప్పున వార్డులు ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట మండలంలో చిల్లకల్లు, షేర్‌మహ్మద్‌పేట, తిరుమలగిరి పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. వీటి రిజర్వేషన్ తేలలేదు.
విజయవాడ డివిజనులో 2642 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 2907 పోలింగ్ బాక్సులు అవసరం ఉంది. ఇప్పటికే మండల కేంద్రాలకు 3509 బాక్సులను చేరవేశారు. అవసరానికి మించి 602 అందుబాటులో ఉన్నాయి.
తొలివిడతలో 12 మేజర్ గ్రామ పంచాయతీలు..