కృష్ణాజిల్లాలో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాలోని జగ్యయ్యపేట, నందిగామ, మైలవరం, పెనమూలురు, కంకిపాడు నియోజకవర్గాల పరిధిలోని 14 మండలల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 234 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉండగా 23 చోట్ల ఏకగ్రీవం కావడంతో 211పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి దశలో పెనుగంచిప్రోలు, చందర్లపాడు, కంచికచర్ల, మైలవరం, గుంటుపల్లి, నున్న, రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు పంచాయతీలు ఉన్నాయి. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో మొత్తం 33పంచాయితీలకు, 270వార్డులకు పోరు నెలకొంది. పెనమలూరు మండల పరిధిలో ఆరు గ్రామాలకు, కంకిపాడు పరిధిలో 17గ్రామాలకు, విజయవాడ గ్రామీణం పరిధిలో 10గ్రామాలకు పోలింగ్ జరగనుంది.
అయితే పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 545మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 2447పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2502వార్డులు ఉండగా... వీటిల్లో 392ఏకగ్రీవం కావటంతో 2110వార్డుల్లో ఎన్నిక జరుగుతుంది. 4533మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు.
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో కొవిడ్ నిబంధనలతో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రామవరప్పాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వద్ద పోలీంగ్ కేంద్రాన్ని డీసీపీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు.
పెనమలూరులో...
పెనమలూరు నియోజకవర్గంలోపోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. కంకిపాడు జడ్పీ పాఠశాలలోని 8 పోలింగ్ బూతుల్లో సరైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రధానంగా ఓటు వేసేందుకు వచ్చిన ఓటరుకు తాము ఎక్కడ ఓటు వేయాలని సమాచారం తెలియకుండా ఉంది. కొవిడ్ నిబంధనల ప్రకారం ఓటర్లు భౌతిక దూరం పాటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.