శునకాలు విశ్వాసానికి మారు పేరు. అవి ఇంట్లో ఉన్నాయంటే యజమానికి కొండంత భరోసా. వీటిని కొందరు కాపలా కోసం పెంచుకుంటే.. మరికొందరు సరదా కోసం పెంచుకుంటారు. ఇంట్లో సభ్యుడిగా చూసుకుంటారు. వాటికి ఏమీ కాకుండా జాగ్రత్తపడతారు. అంత ప్రేమగా చూసుకుంటున్న శునకం చనిపోతే... ఆ యజమాని పడే వేదన వర్ణనాతీతం. సరిగ్గా ఇలాంటి ఘటనే విజయవాడలో జరిగింది.
ఆరోగ్యం దెబ్బతినడంతో...
విజయవాడకు చెందిన యలమంచిలి శ్రీమన్నారాయణ.. వృత్తి రీత్యా బ్యాంక్ ఉద్యోగి. ఆయన కుటుంబ సభ్యులు 13 సంవత్సరాల క్రితం ఓ కుక్కపిల్లను తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో సమానంగా స్థానం కల్పించి, ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా శునకానికి ఆరోగ్యం దెబ్బతింది. పశువైద్యులను సంప్రదించి చికిత్స అందించినప్పటికీ... ఫలితం లేకుండా పోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ శునకం ఇవాళ మరణించింది.