రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..జలదిగ్భందంలో లోతట్టు ప్రాంతాలు భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉరకలేస్తోంది. దేవీపట్నం మండలంలో ఉగ్రరూపం దాల్చింది. దేవీపట్నంతో పాటు వీరవరం, తొయ్యరు, పూడిపల్లి, దండంగి, పోచమ్మ గండి పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద నీటిమట్టం 14.8 అడుగులకు చేరింది. సముద్రంలోకి 14.36 లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల చేస్తున్నారు. పోలవరం మండలం పైడిపాక వద్ద గట్టుకు గండిపడటం వల్ల.... స్పిల్‌వే వైపు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కాజ్‌వే పూర్తిగా మునిగిపోవడంతో కనకాయలంక, బూరుగులంక, అరికెలవారిపేట, జి.పెదపూడి సహా పలు లంకగ్రామాలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయ నది ఉప్పొంగడంతో మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేరుస్తున్నారు.
గోదావరి ఉద్ధృతికి దేవీపట్నం సమీపంలో గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు చేరింది. రహదారులపై వరదనీరు ప్రవహిస్తుండటంతో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరద ఉద్ధృతికి నీట మునిగిన దేవీపట్నం కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ఎడతెరపిలేని వర్షానికి వాగులు, వంకలు పొంగుతున్నాయి. మున్నేరుకు భారీగా వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాల్వకు గండ్లుపడి వందల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వత్సవాయి మండలం లింగాల వంతెనపై 10 అడుగుల ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగడంతో ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. 70 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద సహాయక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. సహాయ ఫోన్ నంబర్లు 0866-2424172, 0866-2422515 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి - వదలని వర్షం.. వీడని ముసురు
జిల్లాలో గత మూడు రోజులుగా 4.53 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటచేలు నీట మునిగాయి. కొన్నిచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడ నగరంతో పాటు.. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు తదితర మండలాల్లో రోజంతా వర్షం పడుతూనే ఉంది. ముసురు వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల అధిక వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో కురిసిన వర్షానికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
- కంట్రోలు రూమ్ నంబర్లు ఇవీ..
- మచిలీపట్నం కలెక్టరేట్ : 08672- 252572
- మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయం : 08672- 252486
- విజయవాడ కలెక్టరు క్యాంపు కార్యాలయం : 0866- 2474805
- విజయవాడ సబ్‌కలెక్టరు కార్యాలయం : 0866- 2574454
- నూజివీడు సబ్‌కలెక్టరు కార్యాలయం : 08656- 232717
- గుడివాడ ఆర్డీవో కార్యాలయం : 08674- 243697
వారం రోజులుగా కురుస్తున్నవర్షాలతో మెట్ట పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, పెసర, మినుము పంటలకు చీడపీడలు విజృంభించే అవకాశం ఉంది. వాతావరణంలో తేమ శాతం కారణంగా కోతకు వచ్చిన పెసర, మినుము పంటలపై ఆశలు వదులుకుంటున్నారు.
తిరువూరు నియోజకవర్గం పరిధిలోని కట్లేరు, ఎదుళ్ల, విప్లవ, కొండ, పడమటి వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. చౌటపల్లి, అక్కపాలెం, వినగడప వద్ద వరదనీరు వంతెనలను తాకుతోంది. వర్షం ఇలాగే కొనసాగుతూ ఎగువ ఉన్న ఖమ్మం జిల్లా నుంచి వరదనీరు వచ్చి చేరితే వంతెనలపై నుంచి ప్రవహించే వీలుంది. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు నిరంతరం వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు. వాగుల ప్రవాహ ఉద్ధృతి పెరిగితే ఈ మార్గాల్లో రాకపోకలు నిలిపివేయనున్నారు. తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు నియోజకవర్గాల పరిధిలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
విశాఖ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. రాబోయే అయిదు రోజుల్లో విశాఖ మన్యంలోని పాడేరు, అరకు, చింతపల్లి పరిదిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని... వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. సీలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో 12వేలు క్యూసెక్కులు వస్తుండగా... 2గేట్లు ఎత్తి దిగువకు 6వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డొంకరాయి జలాశయం ఇన్‌ఫ్లో 30వేలు క్యూసెక్కులు కాగా... 34వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బలిమెల జలాశయానికి భారీ వరద నీరు పోటెత్తుతోంది.అరకు నియోజకవర్గంలో 15గెడ్లల్లో ఉద్ధృత ప్రవహాం కొనసాగుతోంది. ముంచింగిపుట్టు మండలంలో 10 సెం.మీ. వర్షపాతం నమోదయింది.
ఇదీచూడండి
కోస్తాలో ఎడతెరిపి లేకుండా వాన.. పోలవరంలో నిలిచిన పనులు