కృష్ణా జిల్లా గుడివాడలో ఓషియ జ్యూయలరీ నిర్వాహకుడు రెండు రోజులుగా పరారీలో ఉండటం వల్ల ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పాన్ బ్రోకర్ ముకేశ్ వద్ద గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన వేల మంది.. తమ ఆభరణాలు తాకట్టు పెట్టి రూ. 5 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముకేశ్ ఐపీ పెడుతున్నాడనే ప్రచారంతో భారీ మొత్తంలో ఖాతాదారులు ఓషియ జ్యూయలరీ షాపు వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టారు.
గుడివాడ 2వ టౌన్ పోలీసులు జోక్యం చేసుకొని చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకున్న వాళ్లకు టోకెన్లు పంపిణీ చేస్తూ.. అభరణాలు అందిస్తున్నారు. అయితే విలువైన ఆభరణాలు తాకట్టు పెట్టి, పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న బాధితులు.. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.