ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 4, 2020, 6:44 AM IST

ETV Bharat / state

12 లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌కు దూరం!

కరోనా విద్యార్థుల భవిష్యత్​పై తీవ్ర ప్రభావం చూపినవేళ..పాఠశాలలు ఆన్​లైన్​లోనే విద్యబోధన చేస్తున్నాయి. 40శాతం ప్రైవేటు బడుల్లో ఇప్పటికీ పాఠాలు జరగట్లేదు. ఫీజులు చెల్లించాలని..వేరే కారణంతో తల్లిదండ్రులు ఆన్​లైన్​ పాఠాల వైపు మొగ్గు చూపడం లేదు.

online classes burden on students
విద్యార్థులు ఆన్‌లైన్‌కు దూరం

ప్రైవేటు పాఠశాలల్లోనూ లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40శాతం ప్రైవేటు బడులు ఆన్‌లైన్‌ తరగతులనే ప్రారంభించలేదు. కొన్ని యాజమాన్యాలు 9, 10 తరగతులకే నిర్వహిస్తుండగా మరికొన్ని 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నాయి. పిల్లల చదువుల కోసం పట్టణాలకు వచ్చినవారు సొంతూళ్లకు వెళ్లిపోవడం, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సమస్య, ఇద్దరు పిల్లలుంటే రెండు ఫోన్లు లేకపోవడం, ఆన్‌లైన్‌కు హాజరైతే రుసుములు చెల్లించాల్సి రావడంలాంటి సమస్యలతో లక్షలాది మంది ఆన్‌లైన్‌ పాఠాలకు దూరమవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 18 పాఠశాలలుంటే ఆరింటిలోనే ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 15,290 ప్రైవేటు పాఠశాలలుండగా 31 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో దాదాపు 12 లక్షల మంది ఆన్‌లైన్‌ చదువుకు దూరమవుతున్నారు. పాత బకాయిలు, ఆన్‌లైన్‌ తరగతులకు ఫీజులు చెల్లించలేక కొందరు మానేస్తున్నారని విశాఖపట్నానికి చెందిన ప్రైవేటు పాఠశాల యజమాని ఎం.వెంకట్రావు తెలిపారు. కొన్ని ప్రైవేటు బడులు రుసుము చెల్లిస్తేనే పాస్‌వర్డ్‌ ఇస్తున్నాయి. కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ఫీజుల చెల్లింపులను వాయిదా వేస్తున్నారు. కొందరు అప్పులు చేసి కడుతున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో నేర్చుకునేది తక్కువనే అభిప్రాయంతో ఆసక్తి చూపడం లేదు. పదో తరగతి కీలకం కావడంతో ఆ విద్యార్థులకు తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారు. తరగతులకు హాజరవుతున్న వారిలోనూ పదో తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారని రణస్థలానికి చెందిన ప్రైవేటు పాఠశాల యజమాని సీహెచ్‌.శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు పాఠ్య పుస్తకాలు కొంటున్నవారూ తక్కువగానే ఉంటున్నారు. కొన్ని ప్రైవేటు బడులు పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేస్తున్నాయి. కార్పొరేట్‌, సీబీఎస్‌ఈ పాఠశాలలు పుస్తకాలు తీసుకుంటేనే ప్రవేశం, పాస్‌వర్డ్‌ ఇస్తున్నాయి.

అకడమిక్‌ కేలండర్‌ ప్రకటించాలి

‘ఆన్‌లైన్‌ తరగతులతోనే పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తే తల్లిదండ్రులు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. అకడమిక్‌ కేలండర్‌ ఇంకా విడుదల కాలేదు. పదో తరగతి వారే 50-60శాతం హాజరవుతున్నారు. కొందరు పాఠశాలలు తెరిచాకే వస్తామంటున్నారు. గతేడాది ఫీజులు బకాయిలుండగా.. ఈ విద్యా సంవత్సరం రుసుములపై సందిగ్ధత నెలకొంది’

-ఎంవీ రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం

హాజరు తక్కువే..

‘ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నా విద్యార్థుల హాజరు తక్కువే ఉంటోంది. ఫోన్లు లేకపోవడం, సిగ్నల్స్‌ వంటి సమస్యలు ఉంటున్నాయి. ఆన్‌లైన్‌లో పూర్తి స్థాయిలో నేర్చుకునేది ఉండదనే అభిప్రాయం కొందరు తల్లిదండ్రుల్లో ఉంది’ - పెంట్యాల అనిల్‌ కుమార్‌, మాస్టర్‌ మైండ్స్‌ పాఠశాల, విజయవాడ

ఇదీ చూడండి.రేపు దిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ABOUT THE AUTHOR

...view details