సామాన్యులకు అందకుండా పోతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహిస్తూనే.. డిమాండ్‌కు తగ్గట్టు ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి... కిలో 25 రూపాయలకు ఇస్తోంది. రాయితీపై వస్తున్న ఉల్లిపాయలను కొనుక్కునేందుకు రైతు బజార్ల వద్ద ప్రజలు బారులు తీరారు. ధరలు అదుపులోకి వచ్చేవరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా రాయితీపై అందిస్తామని కృష్ణా జిల్లా అధికారులు తెలిపారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ప్రభుత్వం ఉల్లిని అందించడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'ఉల్లి పరుగుకు ప్రభుత్వం కళ్లెం'
కొయ్యకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ధర మూడింతలు పెరిగింది. పట్టపగ్గాల్లేకుండా పోతున్న ఉల్లికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టింది.
తూర్పు గోదావరి జిల్లాలోనూ సామాన్యులకు ఉల్లిని అందించేందుకు అధికారులు.... ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 25 రూపాయలకే కిలో అందిస్తున్నట్లు కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఒక్కో రేషన్ కార్డుకి కిలో చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 27 నుంచి నంద్యాల, ఆదోని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తామని చెప్పారు. రేషన్ కార్డుకు కిలో చొప్పున రాయితీ ఉల్లిని అందిస్తున్న అధికారులు... దాన్ని రెండు కేజీలకు పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు.