ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ పసిపాప వేదన.. 'ముందు ఎందుకిచ్చారు.. ఇప్పుడెందుకు తీసుకుంటున్నారు' - ముసునూరు ఏడాదిన్నర పాప కథనం

'అమ్మా.. నేనేం తప్పు చేశాను.. నాకిప్పుడెందుకింత శిక్ష వేస్తున్నావు.. మారు పెంపకానికి ఇవ్వమని నేనడిగానా.. ఇప్పుడు వెనక్కి తెచ్చేసుకోమని అడుగుతున్నానా.. 3 నెలల పసిప్రాయంలో నీ పొత్తిళ్ల నుంచి మరో ఒడికి నువ్వే కదా చేర్చావు.. ఇప్పుడు ఆ అమ్మకు బాగా అలవాటైన నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు.. పసిదాన్నని, మాటలు రావని, ఏమీ అడగలేననా! లేకపోతే నాకూ ఓ మనసుంటుందని.. అది బాధపడుతుందని తెలియక చేస్తున్నావా. అటూ ఇటూ మార్చడానికి నేను ఆటబొమ్మను కాదమ్మా.. మనసున్న మనిషిని.. మీమీ గొడవల మధ్యలోకి నన్ను లాగి ఏడిపిస్తున్నారు...' ఆ పసిపాపకు మాటలొస్తే ఇలానే అనేదేమో..! మూడు నెలల పసిపాపను పెంపకానికి ఇచ్చి.. ఏడాదిన్నర తర్వాత ఏవో గొడవలతో తన పాప తనకు కావాలంటూ ఓ అమ్మ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది. అయితే కన్నతల్లి ఒడికి చేరుతున్నానన్న ఆనందం కన్నా.. పెంచిన అమ్మకు దూరమవుతున్నాననే బాధే ఆ పాప కళ్లల్లో కనిపిస్తుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా వలసపల్లిలో జరిగింది.

one-and-half-year-baby-story-in-valalapalli-krishna-district
పసిపాప కథనం

By

Published : Aug 31, 2020, 7:31 PM IST

Updated : Aug 31, 2020, 7:50 PM IST

కృష్ణా జిల్లా ముసునూరు మండలం వలసపల్లికి చెందిన గొల్లపల్లి నవీన్ బాబు, రజని దంపతులకు నలుగురు ఆడపిల్లలు. వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఏడాదిన్నర క్రితం తమ నాలుగో సంతానమైన 3 రోజుల పాపను.. సమీప బంధువులైన బొకినాల దశరథ్, సునీత దంపతులకు పెంచుకునేందుకు ఇచ్చారు. వారు 3 నెలల పసికందును తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. నవీన్, రజనిల మధ్య తగాదాలతో... రజనీ నవీన్​పై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో తనకు తెలియకుండా నాలుగో పాపను తన భర్త డబ్బుల కోసం మారు పెంపకానికి ఇచ్చారని పేర్కొంది. తన బిడ్డను తనకప్పగించాలని కోరింది.

ఇప్పుడు పాపను పెంచిన తల్లిదండ్రులు దశరథ్, సునీతల బాధ వర్ణనాతీతంగా మారింది. వారికి ఇంతకుముందే ఇద్దరు మగ పిల్లలు పుట్టి 18 ఏళ్లకు చనిపోయారు. దీంతో ఆడపిల్లను పెంచుకోవాలనే ఉద్దేశంతో సమీప బంధువులైన నవీన్, రజనిల పాపను తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. అయితే దీనిపై వారిమధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఇప్పుడు రజనీ చేసిన ఫిర్యాదు మేరకు వారి బిడ్డను వారికప్పగించాలి. ఇదే ఆ దంపతులకు అశనిపాతం అయ్యింది. '3 రోజుల వయసప్పుడు పాపను తెచ్చుకుని ఇప్పటివరకూ అల్లారుముద్దుగా చూసుకున్నామని.. అలాంటి బిడ్డను ఇప్పుడు ఇచ్చేయమంటే ఎలా అని' ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప తమకు అలవాటయ్యింది.. తాము లేకపోతే బిడ్డ ఉండలేదని అంటున్నారు. వారి మధ్య గొడవలతో తమకు అన్యాయం చేస్తున్నారంటూ వాపోతున్నారు. తాము పాపను పెంచుకునేందుకు నవీన్​కు డబ్బులు చెల్లించలేదని అంటున్నారు.

అయితే వారి మధ్య ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేనందున.. పోలీసులు పాపను కన్నతల్లికి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో పాపను తల్లికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ముసునూరు ఎస్సై కె. రాజారెడ్డి తెలిపారు.

ఏదేమైనప్పటికీ వారి నలుగురి మధ్య ఏ పాపం తెలియని పసిపాప బాధపడుతోంది.

ఇవీ చదవండి...

'మేటి కొప్పాక'.. మనసు దోచే కొండపల్లి బొమ్మల వైభవం

Last Updated : Aug 31, 2020, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details