ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా... ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ విలవిలలాడుతుంది బామ్మ. పేరు తమ్ము అలివేలమ్మ. ఆరేళ్లుగా కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం.. నడకుదురు గ్రామం ప్రక్కన మోపిదేవి నుంచి విజయవాడ వెళ్ళే కృష్ణా నది ఎడమ కరకట్టపై చిన్న పరదాతో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తుంది. భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. ఆస్తి లేక బంధువులు పట్టించుకోలేదు.
విజయవాడ... గోసాల గ్రామం నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ నడకుదురు ఆలయానికి చేరుకుంది. ఆలయం పరిసర ప్రాంతాన్ని శుభ్రపరుస్తుంది. ఆలయానికి వచ్చిన వారు తమకు తోచిన సాయం చేస్తూ ఉండేవారు. అలా వెయ్యి రూపాయలు కూడబెట్టుకుంది. ఆ సొమ్ముతో చిన్న పరదా వేసుకొని అందులోనే జీవనం సాగిస్తోంది.
తమ్ము అలివేలమ్మకు ఆధార్ కార్డు ఉంది. గత 3 ఏళ్లుగా.. రేషన్ కార్డు కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా రాలేదు. వితంతు పింఛనూ అందలేదు. తినడానికి తిండి లేక ఒక్కోసారి పస్తులు ఉంటుంది. జ్వరం వస్తే పలరించే వారు ఉండరు. మంచినీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లి తెచ్చుకుంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోమని కొందరు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.