కరోనా భాధితులకు చికిత్స అందించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కరోనా నిర్ధరణ అయిన వృద్ధురాలి విషయంలో జరగరాని ఘటనే జరిగింది. ఈ నెల 6న స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్న 65 ఏళ్ళ మహిళకు 12న పాజిటివ్ అని సంక్షిప్త సందేశం వెళ్లింది. కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి.. ఆమెను విజయవాడ తరలించాలని 4 సార్లు ఫోన్ చేశారు. సోమవారం సాయంత్రం 108 వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేవంటున్నారని, హోమ్ ఐసోలేషన్లో ఉండమన్నారని బాధితురాలు.. తన కుమారుడికి ఫోన్ చేసింది. రాత్రంతా అక్కడ వరండాలో పడుకొని ఉదయం ఆటోలో బస్టాండ్ కి వచ్చి ఆర్టీసీ బస్సులో జగ్గయ్యపేట చేరుకుంది. ఇది తెలుసుకున్న ఆయా ప్రాంత ప్రజలంతా.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.