సంక్రాంతి.. పిండి వంటలకు ప్రత్యేకం. ఈ ఏడాది నూనె ధరలు కాగుతుండటంతో సామాన్యులపై అదనపు భారం పడింది. కొవిడ్ నేపథ్యంలో దెబ్బతిన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెరుగుతున్న ధరలు ఇబ్బందిపెడుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాల్ని ఘనంగా నిర్వహిస్తారు. రెండు జిల్లాల్లో సుమారు 35 లక్షల కుటుంబాలు ఉండగా వేడుకల్లో 70 నుంచి 80 శాతం జనాభా పాలుపంచుకుంటారు. ప్రత్యేకంగా అరిసెలు, చక్రాలు, కొబ్బరి బూరెలు, చకినాలు, చక్కలు, జంతికలు, సున్నుండలు, నువ్వుల లడ్డు, బూరెలు, పనస తొనలు, కజ్జికాయలు, గవ్వలు, బజ్జీలు తయారు చేస్తారు.
రిటైల్‌లో రూ.10 నుంచి 30 వరకు అధికం..
రిటైల్‌కు వచ్చేసరికి లీటరుకు రూ.10 నుంచి రూ.30 వరకు అధికంగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబరులో పామాయిల్ రూ.90, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.115గా ఉండగా రెండు నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.20, రూ.28 చొప్పున పెరిగాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలకు కాకినాడతో పాటు కృష్ణపట్నం పోర్టు నుంచి నూనెలు దిగుమతి అవుతున్నాయి. మలేషియా, ఇండోనేషియా, రష్యా, అర్జెంటీనా, అమెరికా తదితర దేశాల నుంచి నూనెల దిగుమతులు కొవిడ్‌తో తగ్గాయి. ఇప్పుడిప్పుడే డిమాండ్‌కు తగినట్లు సరకు రవాణా అవుతున్నప్పటికి ధరలు దిగి రావడం లేదు. నెలకు ఒక్క గుంటూరు నగరంలోనే సుమారు 25 నుంచి 30 టన్నులు.. విజయవాడలో సుమారు 40 టన్నుల వంట నూనెల వినియోగం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
పెరిగిన సిమెంట్, ఇటుక ధరలు.. ఇల్లు కట్టాలంటే గగనమే!