ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

130 ఏళ్ల చరిత్ర.. లక్షలాది మందికి అక్షరాలు నేర్పిన ఆ బడి ఎక్కడుందంటే?

130 ఏళ్ల చరిత్ర.. ఎందరో మహానుభావులకు విద్యనందించిన ఘనత దీని సొంతం.. ఎంతో మంది ఉపాధ్యాయులను, డాక్షర్లను, పోలీసులను, రాజకీయ నాయకులను అందించిన కీర్తి ఈ విద్యాలయానికే సొంతం. ఓ మనసున్న దాత స్ఫూర్తితో ఆవిర్భవించిన ఈ విద్యా భాండాగారం.. నేటికీ అనేకమంది పిల్లలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతోంది. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఎక్కడుందో తెలుసుకుందామా..!

By

Published : Jan 2, 2022, 1:49 PM IST

nuziveedu-srr-zp-high-school-special-story
లక్షలాది మందికి అక్షరాలు నేర్పించిన ఎస్.ఆర్.ఆర్ జెడ్పీ హైస్కూల్..!

లక్షలాది మందికి అక్షరాలు నేర్పించిన ఎస్.ఆర్.ఆర్ జెడ్పీ హైస్కూల్..!

పూర్వం చదువు అంటే అందరికీ అందని ద్రాక్ష. ఏ సంపన్న కుటుంబంలోనే పుడితే తప్ప విద్యనభ్యసించలేకపోయేవారు. చదువుకోవాలని ఉన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించే స్తోమత లేత మరికొంత మంది చదువుకు దూరమయ్యారు. అలాంటి సమయంలోనే అందరికీ విద్యనందించాలనే ఉద్దేశంతో ఓ దాత ఈ పాఠశాలను నెలకొల్పాడు. నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి వారిని ఉన్నత స్థానాలకు చేర్చిందీ పాఠశాల. అదే కృష్ణా జిల్లాలోని నూజివీడు ఎస్.ఆర్.ఆర్ జెడ్పీ హైస్కూల్.

1890లో ఆవిర్భవించిన ఈ పాఠశాలకు నూజివీడు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. వంద సంవత్సరాలకు పైగా ఈ పాఠశాలలో ఉర్దూ, సంస్కృత బోధన సాగుతోంది. జిల్లాలోని ఐదు పెద్ద పాఠశాలలో ఇదీ ఒకటి. ప్రస్తుతం ఇందులో 40 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో 930 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు.. వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ చదివినవారే అవడం గమనార్హం. సైన్స్, గణిత శాస్త్ర ప్రయోగ శాలలు కూడా ఈ పాఠశాలలో ఉన్నాయి. చుట్టు పక్కల గ్రామాల్లోని పిల్లలందరూ చదువుకోడానికి ఇక్కడికే వస్తారు.

గత ఇరవై ఏళ్లుగా ఇక్కడ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. బదిలీ పై వెళ్లి రెండోసారి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పిల్లలకు విద్యతో పాటు వ్యక్తిగత విలువలను సైతం నేర్పించే గురువు లు ఉన్నారు. ఈ పాఠశాల ఎంతో చరిత్ర కలిగినది. ఎందరో మహనీయులను అందించిన విద్యాలయం ఇది. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేలా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నా౦.

- ఉషారాణి, ఉపాధ్యాయురాలు

పాఠశాల చరిత్ర...

1890కి ముందు నలుగురు వ్యక్తులు కలిసి... 5000 వేల రూపాయల విరాళాన్ని సేకరించి ఓ పాఠశాల ప్రారంభించారు. అప్పుడు ఇందులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ఉండేది. తొందర్లోనే వారి చేతులో ఉన్న డబ్బులు ఖాళీ కావడం.. ఎవరూ విరాళమిచ్చేందుకు ముందుకు రాకపోవడంతో... పాఠశాలను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో పట్టణంలో ఉన్న రాజరంగయ్య అప్పారావును కలిసి పరిస్థితిని వివరించారు. పాఠశాల బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పి.. బడిని ఆయన కోటలోకి మార్చారు. ఆ సమయంలో ఆరుగురు ఉపాధ్యాయులు, 78 మంది విద్యార్థులు ఉన్నారు. 1891లో 7, 1892లో 8వ తరగతులను కూడా ప్రారంభించారు. 1892లో జీవో నెంబర్ 80012 కింద అన్ని సదుపాయాలు ఉన్న పాఠశాలగా... ఈ బడి గుర్తింపు పొందింది. 1895లో ముస్లిం విద్యార్థుల కోసం ఉర్దూ భాషా పండితులను నియమించారు. 1898లో ఈ బడిని ఉన్నత పాఠశాలగా మార్చారు. 1900 సంవత్సరంలో రాజా రంగయ్య అప్పారావు ఉన్నత పాఠశాలగా మారింది.

ప్రముఖులను అందించిన పాఠశాల ...

చరిత్రలో నిలిచిపోయిన ఎంతో మంది ఇక్కడే చదువుకున్నారని ఈ పాఠశాల చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జలగం వెంకట్రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంఆర్ అప్పారావు, ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం ఈ విద్యాలయంలోనే చదువుకున్నారు. సినీ నటులు కోట శ్రీనివాసరావు, కమెడియన్ సుధాకర్, గీతాంజలి, పరుచూరి బ్రదర్స్, కవులు... కవి సార్వభౌమ విశ్వనాథ సత్యనారాయణ సైతం ఇక్కడ అక్షరాలు దిద్దినవారే. ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ఆలూరి వెంకటేశ్వర్లు లాంటి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్​లు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇలా మరెందరో ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకున్నారు.

ఇదీ చూడండి:

Sid Naidu: నాడు పేపర్ బాయ్.. నేడు "పవర్ ఐకాన్"

ABOUT THE AUTHOR

...view details