కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి టి.పరమేష్ చిత్రపటానికి పూలమాల వేసి.. అతడి మృతికి ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కె.సి. రెడ్డి ఘన నివాళులర్పించారు. విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాంపస్‌లోని విద్యార్థులు, అధ్యాపకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పరమేష్ ఆత్మహత్య ఎంతగానో బాధించిందని కె.సి. రెడ్డి తెలిపారు. తోటి విద్యార్థులు, అధ్యాపకులు అతడి మానసిక స్థితిని అంచనా వేయగలిగినా.. ప్రవర్తనలో మార్పు గమనించినా ఇంతటి అనర్థం జరిగేది కాదన్నారు. ఈ దుర్ఘటన అందరికీ కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలన్నారు.
విద్యార్థుల మానసిక స్థితి, ప్రవర్తనా తీరుపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆచార్య కె.సి రెడ్డి వెల్లడించారు. ఏ విద్యార్థి నష్టపోకుండా అనుక్షణం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని.. దానిని అన్వేషించడం, పరిశోధించడం తక్షణ కర్తవ్యం కావాలని హితవు పలికారు. ఆత్మహత్యల వరకు ఆలోచన చేయకూడదని హెచ్చరించారు.