ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

22 లక్షల మంది లబ్ధిదారులకే ఇళ్ల పట్టాలు

నవరత్నాల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేతో పాటు వివిధ కారణాల వల్ల అర్హులైన వారిసంఖ్య 22 లక్షలుగా తేలింది. ఉగాది నాడు చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల కారణంగా ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేయటంతో మిగిలిపోయిన పనుల్లో వేగం పెంచాల్సిందిగా ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది.

housing for all poor
housing for all poor

By

Published : Mar 22, 2020, 12:04 AM IST

22 లక్షల మంది లబ్ధిదారులకే ఇళ్ల పట్టాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' పథకానికి అర్హులైన వారి సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. ప్రభుత్వం 25 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్దేశించుకున్నప్పటికీ.... వివిధ కారణాల వల్ల ఆ సంఖ్య 22,22,477కు పరిమితమైంది. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తనిఖీలతో పాటు వేర్వేరు నిబంధనల కారణంగా అర్హుల సంఖ్య తగ్గినట్లు సమాచారం. ప్రస్తుతం 8,15,036 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. అలాగే మొత్తం 17,483 లే ఔట్లకుగాను ఇప్పటికి 13,695 చోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేశారు.

భూసేకరణపై దృష్టి

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఉగాది నాడు జరగాల్సిన ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున మొత్తం 19,20,017 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇక ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన 3,02,460 ఇళ్లను కూడా లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించనుంది. అందరికీ ఇళ్లు అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపటంతో మిగిలిపోయిన పనుల వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సేకరించాల్సిన భూములకు సంబంధించిన అంశాలపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది.

వందల కోట్లు చెల్లింపు

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 26,635 ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధం చేశారు. అలాగే ప్రైవేటుగా 14,940 ఎకరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఇప్పటి వరకూ 12,640 ఎకరాల ప్రైవేటు భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికోసం ఇప్పటి వరకూ 1467 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ప్రత్యేకించి భూమి లభ్యత తక్కువగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఈ నిధులు వెచ్చించారు. మిగతా ప్రాంతాల్లో భూమి కొనుగోలు కోసం హడ్కో నుంచి 5 వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details